మంత్రి తలసాని తో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఓటర్లు ఏ రేంజ్ లో షాక్ ఇచ్చారో అర్ధమవుతోంది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నట్లుగా స్పష్టమౌతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పార్టీకి కీలక నేత అయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయనకు కంచుకోట లాంటి మోండా మార్కెట్లో బీజేపీ తన జెండా ఎగరేసింది. తలసాని రాజకీయ జీవితానికి పునాది మోండా మార్కెట్ అన్న సంగతి తెల్సిందే. అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన ఆయన మెల్ల మెల్లగా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అటువంటి చోట బీజేపీ తన జెండాను ఎగరేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల పుష్ప పై విజయం సాధించారు. 2016లో జరిగిన ఎన్నికలలో ఆకుల పుష్ప ఇక్కడి నుంచి గెలిచారు.

 

ఇక నగర ఓటర్లు హైదరాబాద్ లోని మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కూడా షాక్ ఇచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్‌లో తన భార్య స్వప్నను టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు. అయితే ఇక్కడి ప్రజలు బీజేపీ అభ్యర్థి స్వప్నను గెలిపించి ఎమ్మెల్యేకు అయన భార్యకు కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో అనేకమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అంబర్ పెట్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుండి ఉన్నా..  తాజాగా ఇక్కడ బీజేపీ తన సత్తా చాటింది.