కూకట్ పల్లిలో వికసించని కమలం! సోము వీర్రాజేనా కారణం? 

జీహెచ్ఎంసీలో అనూహ్యా విజయాలు సాధించిన కమలం పార్టీ అక్కడ ఎందుకు వాడిపోయింది? ఏపీ బీజేపీ నేతల ప్రచారమే తెలంగాణ బీజేపీ కొంప ముంచిందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇదే చర్చ  ప్రధానంగా జరుగుతోంది. ఏపీ ఓటర్లు ఎక్కువగా ఉంటే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రచారమే తమకు నష్టం కల్గించిందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారట. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తెలంగాణ కమలం నేతలంతా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెబుతున్నారు. సోము వీర్రాజు ప్రచారంతో 10 నుంచి 15 సీట్లు కోల్పోయామని వారంతా నిర్ణయానికి వచ్చారట. 

 

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రచారం చేశారు. కూకట్ పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, హఫీజ్ పేట ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ర్యాలీ తీశారు. గ్రేటర్ ఫలితాల్లో ఇక్కడ బీజేపీ ఒక్క డివిజన్ కూడా గెలవలేదు. నిజానికి కూకట్ పల్లి జోన్ లో ఈసారి బీజేపీ మంచి విజయాలు సాధిస్తుందని అంతా భావించారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే ట్రెండ్ కనిపించింది. సెటిలర్లలో కూడా మెజార్టీ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని డిసైడయ్యారట. అయితే బీజేపీ ప్రచారానికి సోము వీర్రాజు రావడంతో వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ లో గతంలో కంటే అద్భుత విజయాలు సాధించిన బీజేపీ.. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ల లో మాత్రం ఘోరంగా చతికిలపడింది. 

 

కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్లు ఉండగా బీజేపీ ఒక్క డివిజన్ మాత్రమే గెలిచింది. శేరిలింగం పల్లి జోన్ లో 13కు ఇక్కడ కూడా ఒక్కటే గెలిచింది. సోము వీర్రాజు ప్రచారం చేయకపోతే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్, హబ్సిగూడ, వనస్తలిపురంలో బీజేపీ హవా చూపింది. ఎల్బీనగర్ జోన్ లో 11 డివిజన్లు ఉండగా.. అన్ని గెలిచి కమలం స్వీప్ చేసింది. ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉండే హబ్సిగూడ, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. కూకట్ పల్లిలో మాత్రం కమలం పూర్తిగా వాడిపోయింది. వీర్రాజు ప్రచారానికి రాకుంటే కూకట్ పల్లి ఏరియాలోనూ బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 

 

సోము వీర్రాజుపై సీమాంధ్ర ఓటర్ల కోపానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. అమరావతిపై పూటకో స్టాండ్ మార్చడం.. రోజుకో ప్రకటనతో గందరగోళం చేయడంపై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడకుండా టీడీపీపైనా, చంద్రబాబు పైనా విమర్శలు చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. సోము వీర్రాజు లాంటి నేతలతో పార్టీకి నష్టమనే అభిప్రాయం ఆ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. ఏపీలో పార్టీని పాతాళానికి తొక్కుతున్న సోము వీర్రాజు.. హైదరాబాద్ వెళ్లి అక్కడ పార్టీకి నష్టం కల్గించారనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోంది. ఇలాంటి నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ కేంద్ర నాయకత్వమే ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కొందరు చెబుతున్నారట.