శివసేన పులి స్వారీ చేస్తోన్న బీజేపీకి ‘గండం’ తప్పకపోవచ్చు!

శత్రువుగా కనిపించే శత్రువు కంటే… మిత్రుడుగా నటించే శత్రువు చాలా ప్రమాదకరం! ఈ విషయం మోదీ లాంటి రాజకీయ నాయకుడికి , అమిత్ షా లాంటి వ్యూహకర్తకి తెలియదని మనం భావించలేం. కానీ, వారు కూడా ఏమీ చేయలేక కళ్లప్పగించి చూస్తున్నారు శివసేనని! అసలింతకీ మరాఠా పార్టీకి, కాషాయ పార్టీకి మధ్య సమస్య ఏంటి? అదే ఇంత వరకూ అర్థం కానిది! శివసేన ప్రతీ రోజూ , ప్రతీ కారణంపై ఏదో ఒక విధంగా బీజేపీని తిట్టిపోస్తూనే వుంది. అయినా కూడా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుంచీ మాత్రం తప్పుకోదు. మిత్ర పక్షంగా వుంటేనే ప్రతిపక్షాల కంటే దారుణంగా దాడి చేస్తుంటుంది!

 

 

శివసేన, బీజేపీలది ప్రతీ రోజు సాయంత్రం విపరీతంగా గొడవపడే భార్యా, భర్తల సంబంధం లాంటిది. తెల్లవారితే అంతా మామూలైపోతుంది. రెండు పార్టీలు అసలేం కాలేదన్నట్టు నటిస్తాయి. తాజా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా అంతా శివసేన బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటుందని అంచనా వేశారు. ఉద్ధవ్ గత కొన్ని నెలలుగా తన పత్రిక సామ్నాలో దుమ్మెత్తి పోస్తూనే వున్నాడు. తమ సీఎం ఫడ్నవీస్ ను, దేశ ప్రధాని మోదీని ఆయన తిట్టని తిట్టు లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక కూడా శివసేన మరో మారు బీజేపీపై మాటల బాంబులు వేసింది. తమ పత్రికలో మోదీని కసాయి అనేసింది. జంతువుల్ని కాపాడుతాడుగానీ మనుషుల్ని పట్టించుకోడనీ, దయ, జాలీ లేవని నోటికి వచ్చినట్టు రాసేశారు. మరింత కోపమే వుంటే మోదీకి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయవచ్చు కదా? అలా చేయలేదు! సైలెంట్ గా శివసేన ఎంపీలు జారుకున్నారు. సభలో లేకపోవటం ద్వారా బీజేపీకి, మోదీకి కావాల్సినంత మేలు చేశారు!

 

 

ఒకవైపు శివసేన అయోమయంగా ప్రవర్తిస్తున్నా బీజేపీ ఏమీ అనకుండా మౌనంగా భరిస్తోంది! అంతకు మించి కాషాయ అగ్రనేతలు చేయగలిగింది కూడా ఏం లేదు. మహారాష్ట్రలో కమలానికి స్వంత మెజార్టీ లేదు. కేంద్రంలో కూడా వాజ్ పేయ్, అడ్వాణీ హయాం నుంచీ శివసేన తోడుగా వుంటోంది. అక్కడా సాటి హిందూత్వ పార్టీ అయిన శివసేనని కమలదళం వదలలేదు. ఇలా దిల్లీలో, ముంబైలో రెండు చోట్లా శివసేన అవసరం ఎంతో కొంత బీజేపీకి కూడా వుంది. ఇదే మోదీ, అమిత్ షాల సహనానికి,మౌనానికి కారణం!

 

 

ఇష్టం లేని కాపురం శివసేన, బీజేపీలు ఇంకా ఎంత కాలం చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఇదే తంతు కొనసాగితే మాత్రం ఇద్దరికీ కష్టమే. ప్రాంతీయ పార్టీ అయిన శివసేనని పక్కన పెడితే మళ్లీ ప్రధాని కావాలని పట్టుదలతో వున్న మోదీకి మాత్రం … మిత్ర పక్షంలా పక్కనే వుంటూ బల్లెంలా తయరైన మరాఠా పార్టీ ఏనాటికైనా ప్రమాదమే! శివసేన పులి స్వారీ చేయటం… దుస్సాహసమే!