బీజేపీకి శివసేన కొత్త ప్రతిపాదన

 

అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన, బిజెపి మధ్య మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకం వ్యవహారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. శనివారంనాడు ఆ ఇరు పార్టీల మధ్య ఏ విధమైన చర్చలూ జరగలేదు. పాతికేళ్ల స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా వుంటే, శనివారం నాడు బిజెపి ముందు శివసేన కొత్త ఫార్ములాను పెట్టినట్లు వార్తలు వచ్చాయి. బిజెపికి 126 సీట్లు ఇచ్చి, తాము 155 సీట్లకు పోటీ చేస్తామని శివసేన ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, అటువంటి ప్రతిపాదనేది తమ వద్దకు రాలేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం నాడు  కొలిక్కి వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.