మోడీపై శివమెత్తిన శివసేన

 

కేంద్రంలోని ఎన్డీఏ కి మిత్ర పక్షమైన శివసేన మరోసారి తన అధికార పత్రిక వేదికగా మోడీ తీరును తూర్పారబట్టింది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ వ్యవహారంలో అనుసరించిన తీరును తప్పుబట్టింది. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మకు ఉద్వాసన పలికే ముందు కనీసం ఆయన వాదనలు వినిపించుకొనే అవకాశం కల్పించకపోవడం.. తప్పుడు సూచనలు లేవనెత్తుతోందని అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ‘‘ఒకవేళ రఫేల్‌ వ్యవహారంలో తనను తాను రక్షించుకొనేందుకు ప్రధాని తనకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని ఉంటే.. అలాంటి అవకాశాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్‌ వర్మకు ఎందుకు ఇవ్వలేదు? సీబీఐ వద్ద రహస్యాలు ఉండడంతో అందుకు భయపడిన కొంత మంది, తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను ఒక్క రోజు కూడా పదవిలో ఉంచకుండా ఉద్వాసన పలికారా? ఆయన సీబీఐ చీఫ్‌గా ఉంటే రఫేల్‌ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని భయమా?’’ అని శివసేన ప్రశ్నించింది.

‘‘ఒకవేళ ఆలోక్‌ వర్మ నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే అతనిపై నేరుగా చర్యలెందుకు తీసుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఈ పనులు చేయకుండా అగ్నిమాపక, హోంగార్డులశాఖకు డీజీగా ఎందుకు బదిలీ చేశారు? ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వ్యవహారంలో లేవదీసిన ప్రశ్నలకు ప్రధాని వద్ద ఉన్న న్యాయవాదుల వద్ద కూడా సమాధానాలు లేవు.’’ అని సామ్నా పత్రిక సంపాదకీయంలో రాసుకొచ్చింది. కేంద్రం బలవంతపు సెలవుపై పంపిన ఇద్దరిలో ఒకరైన రాకేశ్‌ అస్థానా మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) మద్దతుతో సీబీఐను ప్రభుత్వానికి బానిసగా మార్చుతున్నారని శివసేన ఆరోపించింది.