విభజనకు మరికొన్ని సమావేశాలు తప్పవేమో: షిండే

 

రాష్ట్ర విభజనపై కసరత్తు చేస్తున్న కేంద్రమంత్రుల బృందం రేపు సమావేశం కాబోతుంటే, కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు సమావేశం కాబోతోంది. రేపు అంటోనీ నివాసంలో జరిగే కేంద్రమంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారు చేసి, ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిని ప్రవేశపెట్టాలని ముందు నుండి అనుకొంటున్నారు. అయితే  కేంద్రమంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్నషిండే ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “ఇంకా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. అందువల్ల రేపటి సమావేశమే ఆఖరుదని ఇప్పుడే చెప్పలేము. అవసరమయితే మరి కొన్ని సమావేశాలు జరిపి, అన్ని సమస్యలను ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కరిస్తాము. ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.

 

రేపు కేంద్రమంత్రుల బృందం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8గంటల వరకు సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే ఈ బృందం ఏర్పడిన తరువాత జరిగే అత్యంత సుదీర్గ సమావేశామిదే అవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం గట్టిగా భావిస్తున్నందున, బహుశః ఈ సమావేశంలోనే వారు తమ నివేదికను దాదాపు ఖరారు చేసినా చేయవచ్చును. ఇంతవరకు కాంగ్రెస్ పెద్దలు ప్రతీ అంశంపైనా ఇదేవిధమయిన సందిగ్దత ప్రదర్శిస్తూనే, విభజన ప్రక్రియను సకాలంలోనే పూర్తి చేస్తున్నారు. బహుశః ఇప్పుడు కూడా షిండే మళ్ళీ అదే పద్ధతి అమలుచేస్తున్నారేమో.