మరోసారి పేలిన శత్రుఘన్ సిన్హా
Published on: Wed Feb 17, 2016 10:10AM

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన శత్రుఘన్ సిన్హా మరోసారి తన సొంత పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఈసారి నేరుగా జేఎనయూలో జరుగుతున్న వివాదం మీదే తన వాగ్బాణాలను గురిపెట్టారు. జెఎన్‌యూలో జాతివిద్రోహక చర్యలు సాగుతున్నాయనీ, అక్కడి విద్యార్థి నాయకుడు కన్నయా కుమార్ ఒక తీవ్రవాద అనుకూల కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొంటూ ప్రభుత్వం అతడిని నిర్బంధించిన విషయం తెలిసిందే. కానీ తాను కన్నయా కుమార్ ఉపన్యాసాన్ని విన్నాననీ, అతను అన్న మాటలలో తప్పేమీ తనకు కనిపించడం లేదనీ శత్రుఘన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఓ పక్క బీజేపీ ఆనాటి విద్యార్థులని జాతివిద్రోహులుగా ముద్రవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, అది సరైన పద్ధతి కాదంటూ శత్రుఘన్ మండిపడ్డారు. ‘అలాంటి ఆరోపణలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, మన పిల్లల్లాంటివారి మీద అలాంటి ఆరోపణలు తగవనీ’ ట్వీటారు. పైగా కన్నయా కుమార్ తమ బీహార్ బాబనీ, ఆయన తొందరలోనే విడుదల కావలని కోరుకుంటున్నాననీ ట్విట్టర్ సాక్షిగా దేవుని ప్రార్థించారు. అసలే ఈ గొడవలోంచి ఎలా బయటపడదామా అని ప్రయత్నిస్తున్న బీజేపీ, ఇప్పుడు తన పార్టీ సహచరుడే అయిన శత్రుఘన్ చేస్తున్న వ్యాఖ్యలతో తలపోటు పట్టుకుంది. అలాగని ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిద్దామా అంటే, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న మనిషి, బయటకి వెళ్తే ఇంకేం అరుస్తారో అని భయం!


