ఒమిక్రాన్ కన్నా మోదీ ‘ఓ మిత్రో’ ప్రమాదకారి
Published on: Tue Feb 1, 2022 11:37AM
ప్రపంచ జనాభాను వేగంగా కమ్మేస్తూ.. గడగడలాడిస్తోంది కరోనా వేరియంట్ ఒమిక్రాన్. ఇంత ప్రమాదకర సందర్భాన్ని అన్వయిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు శశి థరూర్. ‘ఒమిక్రాన్’ కన్నా ‘ఓ మిత్రో’ చాలా అత్యంత ప్రమాదకరం అంటూ శశిథరూర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో చేసిన పోస్టు ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతోంది. ‘ఓ మిత్రో’ అనే దాని వల్లే రోజు రోజుకూ విద్వేషం, మతోన్మాదం, రాజ్యాంగంపై అసహజమైన దాడులు, ప్రజాస్వామ్యానికి విలువ తగ్గిపోవడం లాంటి పరిణామాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయం మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం అంటూ శశి థరూర్ పెట్టిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కోవిడ్ వైరస్ లలో కొన్ని తక్కువ తీవ్రత ఉన్నవి కూడా ఉండొచ్చు... అయితే.. ‘ఓ మిత్రో’ అనే వైరస్ లో తక్కువ తీవ్రత ఉన్న వేరియంట్ అసలే లేదు అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో ‘మిత్రో’ అనే పదాన్ని తరచుగా వినియోగిస్తుంటారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా.


