TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నయ్య భగత్ సింగా.. మరి రాహుల్, సోనియా..? మరో వివాదంలో శశిథరూర్

Published on: Tue Mar 22, 2016 2:32PM

 

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే తన భార్య ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత.. దేశ ద్రోహి ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చి మరో వివాదంలో ఇరుక్కున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిర్వహించిన సమావేశంలో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, బాల్ గంగాధర్ తిలక్, అనీబీసెంట్ లాంటి ప్రముఖులు బ్రిటిష్ కాలంలో దేశ ద్రోహం చట్ట బాధితులే అని.. వ్యాఖ్యానిస్తుండగా.. ఇంతలో ఓ విద్యార్ధి లేచి భగత్‌సింగ్ కూడా అని గుర్తు చేశాడు. దీనికి శశిథరూర్ స్పందించి.. కన్హయ్యకుమార్ ఈ కాలపు భగత్‌సింగ్ అని పేర్కొన్నారు. కన్హయ్యకుమార్ మోదీ ప్రభుత్వానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు.

 

ఇప్పుడు శశిథరూర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  స్వాతంత్య్ర సమరయోధుడితో కన్నయ్య కుమార్ పోల్చడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కన్హయ్యకుమార్ భగత్‌సింగ్ అయితే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎవరని ప్రశ్నించారు.

 

ఇక రాజకీయ నేతలకు కూడా మాటలు అనడం ఆ తరువాత అనలేదని చెప్పడం పరిపాటైపోయింది. ఇప్పుడు శశిథరూర్ కూడా నేను కన్హయ్యను భగత్‌సింగ్‌తో పోల్చలేదని చెబుతున్నారు. ఎంతైనా నిప్పులేనిదే పొగ రాదు కదా..