క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన కాళేశ్వరం పంప్ హౌస్ లూ చూడండి.. కేటీఆర్ కు షర్మిల సూచన
Published on: Mon Jul 25, 2022 11:52AM
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ప్రగతి భవన్ లో జారి పడి కాలి చీలమండ గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాను గాయపడినట్లు ఆయన ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ లో ప్రగతి భవన్ లో జారిపడి చీలమండ వద్ద లిగమెంట్ దెబ్బతిందని పేర్కొన్న ఆయన వైద్యుల సలహా మేరకు మూడు వారాలు పూర్తి విశ్రాంతిలో ఉంటానని తెలిపారు. అక్కడితో ఆగకుండా విశ్రాంతి సమయంలో ఓటీటీలో వీక్షించడానికి మంచి షోలు ఏమైనా సూచించాల్సిందిగా ఆయన ఆ ట్వీట్ లో తన ఫాలోవర్స్ ను కోరారు.
కేటీఆర్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారు ఆయనకు ఏ షోలు సూచించారో తెలియదు కానీ.. వైఎస్సార్ టీవీ నాయకురాలు షర్మిల మాత్రం కేటీఆర్ ఏం చూస్తే బాగుంటుందో సూచించారు. ఈ మేరకు ఆ ట్వీట్ లో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన షర్మిల కేటీఆర్ విశ్రాంతి సమయంలో చూసేందుకు చాలా ఉన్నాయనీ, వాటిలో కుట్ర సిద్ధాంతం గురించి తెలియజేసే కార్యక్రమాలు, నీట మునిగిన కాళేశ్వరం పంపు హౌజ్ లు, క్లౌడ్ బరస్ట్, అలాగే ముంపునకు గురైన గృహాలు, జనం కష్టాలు చూస్తే కాలక్షేపానికి కాలక్షేపం, ఆనందానికి ఆనందం దొరుకుతుందని సెటైర్ వేశారు.


