TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పై షర్మిల ప్రశ్నాస్త్రాలు? మద్యం కుంభకోణంలో విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీత

Published on: Sat May 24, 2025 9:45AM

మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అండగా నిలిచారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

అధికార పగ్గాలు చేపట్టిన తరువాత షర్మిలను జగన్ దూరం పెట్టారు. ఆ తరువాత షర్మిల రాష్ట్రం  వదిలి వెళ్లి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుంచీ సందర్భం వచ్చినప్పుడల్లా సోదరుడిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇదంతా తెలిసిందే. కారణమేంటో తెలియదు కానీ ఇటీవల కొంత కాలంగా షర్మల జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం తగ్గించారు. కానీ తాజాగా మరోసారి షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గురువారం ( మే 22) మీడియా సమావేశంలో మాట్లాడిన తరువాత  షర్మిల జగన్ కు కీలక ప్రస్నాస్త్రాలు సంధించారు.  ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉన్న ష‌ర్మిల‌ తాజా ప్రశ్నలతో మరో సారి జగన్ ను ఇరుకున పెట్టారని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణంలో వరుసగా బయటపడుతున్న అంశాలు  థ్రిల్లర్ సిరీస్ ను త‌ల‌పిన్నాయన్న షర్మిల.. ఆ కుంభకోణం దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలతో వైసీపీలో భయం మొదలైందన్నారు.  

మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా ఉన్నాయన్నారు. బట్టలూడదీస్తాను, తరిమితరిమి కొడతాను అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని షర్మిల తప్పుపట్టారు. సీఎంగా ఉండగా జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్న ష‌ర్మిల‌..  ఆ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింది నువ్వే కదా అని జగన్ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె  రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్, ముంబై న‌టి కాదంబరి జెత్వానీ ఉదంతాలను గుర్తు చేశారు.  

లిక్కర్ కుంభకోణంలో జగన్ మీద ఆరోపణలు ఉన్నాయన్న షర్మిల వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యం లేక పిరికిపందలా దాక్కుంటున్నారని విమర్శించారు. వైఎస్ కుమారుడిగా ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిన జగన్ ఇలా పిరికిపందలా భయంతో వణికిపోవడమేంటని ప్రశ్నించారు. అంతే కాదు అసలు జగన్ అసెంబ్లీకి ఎందకు వెళ్లడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  లిక్కర్ కుంభకోణంపై తనను విచారించాలని జగన్ అడగడం లేదంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా అని షర్మిల ప్రశ్నించారు.  వైసీపీ హయంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ ను ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించిన ఆమె ఆ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడకు పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.