షర్మిల బరువు ఎంతో తెలుసా?
Published on: Thu Feb 3, 2022 4:16PM
వైఎస్ షర్మిల. వైఎస్సార్ తనయ. జగనన్నకు చెల్లి. అన్నతో తెగదెంపులు చేసుకొచ్చి.. తెలంగాణలో సెటిల్ అయ్యారు. వైఎస్సార్‌టీపీతో సొంతంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అన్న మీద కోపమంతా కేసీఆర్ మీద చూపిస్తున్నట్టున్నారు. ప్రగతిభవన్‌పై పదే పదే బాణాలు సంధిస్తున్నారు.
షర్మిలను పట్టించుకునే వాళ్లు తక్కువే అయినా.. ఆమె మాత్రం చిత్తశుద్ధిగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ట్వీట్లతో కేసీఆర్‌ను గిల్లుతున్నారు. పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలపైనా సెటైర్లు వేస్తున్నారు.
అయినా, షర్మిలను తెలంగాణ మనిషిగా మనస్పూర్తిగా స్వీకరించలేకపోతున్నారు ప్రజలు. అందుకే, తెలంగాణ యాసలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్నారు. తాజాగా, తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే ములుగు జిల్లా మేడారం జాతరకు ముందుగానే హాజరయ్యారు షర్మిల. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు భక్తితో.. తనెత్తు బంగారంతో (బెల్లం) తులాభారం సమర్పించుకున్నారు. షర్మిల రాకతో మేడారంలో కోలాహలం నెలకొంది.


