షర్మిల నోటికి ఎవరయినా లోకువే

 

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పాద యాత్రలు, బస్సుయాత్రలు చేస్తున్నషర్మిల కనీసం ఇంతవరకు ఆ పార్టీ సభ్యత్వమయినా తీసుకొన్నారో లేదో తెలియదు. ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున పనిచేస్తున్నారు. ఆమె చిరకాలం రాజకీయాలలో ఉండబోదని స్వయంగా ఆమె భర్త అనిల్ కుమార్ ఇటీవలే మీడియాతో అన్నారు. అయినప్పటికీ ఆమె వైకాపా తరపున ప్రజలకు చాలా వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో ఏ హోదా లేకపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చప్రాసీ దగ్గర నుండి ప్రధాని మంత్రి దాకా ఎవరినీ విడిచిపెట్టకుండా తీవ్ర విమర్శలు చేస్తూన్నారు. అదేవిధంగా తెదేపా, తెరాస తదితర రాజకీయ పార్టీల నేతలు తన నోటి ముందు బలాదూర్ అన్న రీతిగా తన వయసుకు, పార్టీలో హోదాకు(?) మించి మాట్లాడుతున్నారు.

 

ఆమె ఇంత వరకు కనీసం ఒక కార్పొరేటర్ వంటి చిన్న పదవిలో కూడా పనిచేసిన అనుభవం లేదు. రాష్ట్రాన్ని,దేశాన్నినడిపించడంలోఉండే కష్ట సుఖాలు ఆమెకు తెలియకపోయినా ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రధాని వరకు అందరూ కూడా ఆమెకు లోకువే. ఈ రోజు ఆమె ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు ఏమి తెలియనట్లు దిష్టి బొమ్మలా కూర్చోన్నారని, ఆయన నిజంగానే రాష్ట్ర సమైక్యత కోరుకుంటున్నట్లయితే వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు.

 

వైకాపాలో కనీసం కార్యకర్తకూడా కాని ఆమె యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నవ్యక్తిని పట్టుకొని దిష్టిబొమ్మ అనడం, రాజీనామా చేయమనడం చాల అనుచితం. ఆయన ఆ పదవిలో కొనసాగాలో వద్దో చెప్పడానికి కూడా ఆమెకు తగిన అర్హత, రాజకీయానుభవం లేవు. రాజకీయాలంటే కేవలం నోరు పారేసుకోవడం కాదనే సంగతి ఆమె తెలుసుకోవలసి ఉంది. తనకంటే వయసులో, రాజకీయాలలో అన్ని విషయాలలో ఎంతో అనుభవం కలిగిన వారి పట్ల ఆమె మాట్లాడుతున్నతీరు చాలా ఆక్షేపనీయంగా ఉంది.

 

కనీసం వారి అనుభవంత వయసు కూడా లేని ఆమె చిన్నాపెద్దా చూడకుండా నోటికి వచ్చినట్లు తూలనాడుతూ, దానినే రాజకీయాలనే భ్రమలో ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర మొదలుపెట్టిన ఆమె, కేవలం అందుకు సంబందించిన మాటలు మాట్లాడితే ఎవరయినా హర్షిస్తారు. లేదా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించావచ్చో చెప్పినా ప్రజలు హర్షిస్తారు. లేకుంటే ప్రజలను తమ పార్టీకే ఓటేసి గెలిపించమని నేరుగా కోరినా అర్ధం ఉంది. కానీ, ప్రజలను ఆకట్టుకోవడం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.