TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ వెంటనే చేపట్టాలి

Published on: Wed Jul 29, 2020 3:36PM

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పలు అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకులతో కూడిన సలహాలిచ్చారు. 

మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే  ప్రాధాన్యతను ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలకు పవార్ స్పందిస్తూ.. అది రాహుల్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని అన్నారు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. అతని విశ్వసనీయత తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దీనిని రాహుల్ నివారించాలని హితవు పలికారు.

ఓ జాతీయ ఛానల్‌కు శరద్ పవార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఔనన్నా, కాదన్నా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం వెన్నెముక అని స్పష్టం చేశారు. చాలా సంవత్సరాలుగా తాను కాంగ్రెస్ పార్టీని చూస్తున్నానని, రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో సోనియాగాంధీ సక్సెస్ అయ్యారని తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ కేడర్ ఒప్పుకుంటుందని.. అయితే, అది ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. అయితే, రాహుల్ కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పదల్చుకున్నా అని పవార్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ వెంటనే చేపట్టాలని పవార్ సూచించారు. రాహుల్ దేశ పర్యటన ప్రారంభించాలని చెప్పారు. కార్యకర్తలు, నాయకులను రాహుల్ కలుసుకోవాలని సూచించారు. ఇదే పనిని రాహుల్ కొన్ని సంవత్సరాల క్రితం చేశారని.. ఇప్పుడు మరోసారి ఆ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యకర్తలందర్నీ ఏకతాటిపైకి తేవడానికి ఇది దోహదపడుతుంది అని పవార్ సూచించారు.