Latest News

పాద‌యాత్ర శ‌త‌దినోత్స‌వం ప‌ద‌విని ఇస్తుందా ష‌ర్మిలా మేడమ్!

posted on: Jun 20, 2022 10:40PM

న‌డ‌క ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు ఇప్ప‌టి డాక్ట‌ర్లు. న‌డ‌క రాజ‌కీయంగా దేశంలో ఐక్య‌త‌ను సాధించ‌డానికి గొప్ప ఆయుధంగా పూర్వ‌మే మ‌హాత్మా గాంధీ చేసి చూపారు. కాంగ్రెస్ నేత మాజీ ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. కూడా వేల కీలోమీట‌ర్లు  న‌డిచి త‌న పార్టీ ఘ‌న విజ‌యానికి కార‌కులయ్యారు. అస‌లు ఏద‌యినా పెద్ద స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే నాయకులు పాద‌యాత్ర‌  అస్మ‌దీయుల‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి ఉప‌యోగించుకుంటున్న బ్ర‌హ్మాస్త్రం. పాద‌యాత్ర‌ల్లో భాగంగా రోడ్డు షోలు వాక్చాతుర్యంతో  దారిన‌పోయే వారంద‌రినీ మూగేట్టు చేసి త‌మ పార్టీ గొప్ప‌ద‌నాన్ని చాటుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.

పాద‌యాత్ర‌ల్లో నాయ‌కులు ప్ర‌జాక‌ర్ష‌ణ‌ను పెంచుకోవ‌డం పరిపాటి. ఇప్పుడు ష‌ర్మిల వంతు వ‌చ్చింది. దివంగత వైఎస్ కుమార్తెగానే కాకుండా తెలంగాణా లో కొత్త పార్టీ ప్రారంభించి జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డానికి, ఇక్క‌డి టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు కాస్తంత జ్ఞానోద‌యం క‌లిగించ‌డానికి వై.ఎస్‌. ష‌ర్మిల కూడా పాద‌యాత్ర మార్గాన్నే ఎంచుకున్నారు. ఇది ముచ్చ‌ట‌ ప‌డి చేసిన పాద‌యాత్ర కాదు. తానూ సీ.ఎం కావాలన్న కోరిక‌తోనే చేప‌ట్టిన మ‌హా యాత్ర‌. జూన్ 20 వ తేదీకి ష‌ర్మిల పాద‌యాత్ర వంద‌ రోజులు పూర్తి చేసుకుంది,

అంటే శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ  సందర్బంగా షర్మిల పార్టీ ఓ వీడియోను సైతం విడుదల చేసింది. సదరు వీడియోలో జై తెలంగాణ, జోహార్ వైయస్ఆర్,  1300ల కిలోమీటర్లు  నడిచింది నేనే అయినా నడిపించింది  మీ అభిమానమే  అంటూ సాగిన ఈ వీడియో ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు..ఈ వీడియోలో.. వైయస్ షర్మిల సభలో కొందరు యువకులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న అంశాన్ని కూడా జోడించడం గమనార్హం. అస‌లు రాయ‌ల‌సీమ నుంచి వ‌చ్చిన అమ్మాయి ఈడెట్టా సీఎం ఐత‌ది అన్న గొప్ప ఆలోచ‌నా ఇక్క‌డివారికి రాకపోలేదు. కాబోతే వంద‌ రోజుల ఉత్సాహంలో ష‌ర్మిల‌కు ఆ మాట విన‌ప‌డ‌లేదేమో!

ఇదిలా వుండ‌గా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ఇప్పటికే వైయస్ షర్మిల ప్రకటించారు. ఈ జిల్లాలో దివంగత  వైయస్ రాజశేఖరరెడ్డికి బలమైన అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు 2014 నాటి ఎన్నికల ఫలితాలే రుజువు.  అది గ‌తం. అయిన‌ప్ప‌టికీ ఓసారి ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేద‌ని ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌ గాలి  ఎటుందో తెలుసుకోవాల‌నుకున్నారు షర్మిల.

 పాలేరు నియోజకవర్గంలో సర్వే చేయించుకుని ఆ తర్వాతే వైయస్ షర్మిల ఈ ప్రకటన చేశారనే  చర్చ తెలంగాణలో వుంది. 2021, అక్టోబర్ 20వ తేదీన వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. అనంతరం కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. మ‌ళ్లీ  మే నెల మధ్యంలో షర్మిల  తన పాద యాత్రకు మరోసారి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి తన తల్లి వైయస్ విజయమ్మ, భర్త బ్రదర్ అనిల్ కుమారుతో కలిసి అమెరికా వెళ్లి వ‌చ్చారు.  ఆమె పాదయాత్రను మే 28 నుంచి మళ్లీ ప్రారంభించారు. ఇక గతంలో ప్రతిపక్ష నేత   జగన్ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండగా జగనన్న వదిలిన బాణం అంటూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో  షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం విధితమే.

అనంతరం వైయస్ జగన్ కూడా పాదయాత్ర చేసి 2019లో జరిగిన పార్టీని భారీ  మెజార్టీతో గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్‌కు ఆయన తల్లి  విజయమ్మ, సోదరి  షర్మిలతో మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో తల్లీ కూతుళ్లు తెలంగాణాకు వచ్చి  స్థిరపడ్డారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీని లోటస్ పాండ్‌ వేదికగా వైయస్ షర్మిల స్థాపించారు.    తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నిరుద్యోగులు కోసం ఆమె దీక్షలు  చేపట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రజల సమ స్యలు తెలుసు కోవ‌డానికి  ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను   చేపట్టారు.
మూడోసారి అధికారం కోసం సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల‌ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసు కుని మరీ పావులు కదుపు తున్నారు. అలాగే కమలనాథులు తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సైతం తెలంగాణలో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చ‌మ‌టోడు స్తున్నారు. మరి ఇన్ని పార్టీలు ఇందరు నాయకుల నడుమ జగనన్న వదిలిన బాణంగా పేరు పొందిన వైయస్ షర్మిల  రాజకీ యంగా దూసుకుపోతున్నారా? అధికారాన్ని హస్తగతం చేసుకుని.. పక్క రాష్ట్ర సీఎం, సోదరుడు కూడా అయిన‌ జగన్‌కు తాను రాజన్న కూతురినంటూ   కౌంటర్ ఇస్తారా?  

ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాల గురించి ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే అస‌లు తెలంగాణావారికి రాయ‌ల‌సీమ నాయ‌కులు అంటేనే ప‌డ‌దు. ష‌ర్మిల వెన‌క వంద‌లాదిగా అడుగు వేసి కాస్తంత మ‌ద్ద‌తుగా రావ‌చ్చు కానీ వారంతా ఆమెకు ఓటు వేసి ఎలా గెలిపిస్తారు. ఆంధ్రాకి చెందిన రాజ‌కీయ కుంటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయి తెలంగాణాకు తెలంగాణావాదులు ఆశించిన న్యాయం ఏం చేస్తుంది? ఇక్క‌డి తెలంగాణా నాయ‌కులు ఆమెకు పీఠం ఎక్కే అవ‌కాశం ఇవ్వ‌డానికి ముందుకు వస్తారా?. పార్టీల మ‌ధ్య విభేదాలు వున్న‌ప్ప‌టికీ ఇక్క‌డివారే గెల‌వాలి, సీఎం పీఠం ఎక్కాలే త‌ప్ప మ‌న తెలుగువాళ్లే న‌ని మ‌రోసారి రాయ‌ల‌సీమ‌వారికి అవ‌కాశాన్ని ఇస్తారా? అన్న‌గారి మీద  అలిగో, త‌న‌కు స‌త్తా వుంద‌నో,  ఆత్మ విశ్వా సం  తోనో ష‌ర్మిల జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌డానికి వంద‌ల కిలోమీట‌ర్ల  పాద‌యాత్ర  చేసి  వందో రోజు పూర్తి  చేసుకున్నంత మాత్రాన తెలంగాణాలో రాజ‌న్న రాజ్యం తెచ్చేయగలుగుతారా?  తెలంగాణా వారికి విడిపోయిన తెలుగు రాష్ట్రంతో స్నేహ‌పూర్వ‌క సంబంధాలే ఇష్టంగాని మ‌ళ్లీ నెత్తినెక్కి పెత్తనం చేస్తానంటే అంగీకరిస్తారా? పాపం ఆడ‌బిడ్డ  అన్ని వూళ్లూ తిరుగుతోంద‌ని ర‌వ్వంత జాలిప‌డి పీఠం ఎక్కిస్తారా? వంద రోజుల పాదయాత్రల సంబరాలు అధికార పీఠానికి సోపానాలౌతాయా?    

google-ad-img
    Related Sigment News
    • Loading...