TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన మనీదీప్ కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ..!

Published on: Mon Jul 13, 2026 4:22PM

 

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి గుజ్జా మనీదీప్ రెడ్డి కుటుంబాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం వైదేహి నగర్ కాలనీలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మనీదీప్ తల్లిదండ్రులు ముత్యం రెడ్డి, మమతా రెడ్డి తమ కుమారుడు ఇంకా బతికే ఉన్నాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం సముద్రంలో లభించిన మృతదేహాన్ని ఇప్పుడు తమ కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నించారు. శాస్త్రీయంగా నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు, అధికారిక సాక్ష్యాలు చూపిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

"మా కొడుకు చనిపోలేదు... అతను క్షేమంగానే ఉన్నాడనే నమ్మకం మాకు ఉంది. పూర్తి స్థాయి నిర్ధారణ వచ్చేవరకు అతని మరణాన్ని మేము అంగీకరించం" అంటూ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులతో కేసుకు సంబంధించిన తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్న బండారు దత్తాత్రేయ, మనీదీప్‌ను గుర్తించి సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి సంబంధిత అధికారులు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కేసు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తన సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.