వరంగల్ లో కలకలం.. ఒకే బావిలో ఏడు మృతదేహాలు

పొట్టకూటికోసం పశ్చిమ బెంగాల్‌, బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ బావిలో శవాలుగా తేలారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. నిన్న బావిలో 4 మృతదేహాలు లభ్యం కాగా, ఈరోజు మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది.

కోల్‌కతాకు చెందిన మక్సూద్‌ (50) దాదాపు 20 ఏళ్లుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్‌లో నివసిస్తూ.. ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. అతడికి భార్య నిషా(45), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న అతడి కుమార్తె కూడా.. తన కొడుకుతో కలిసి తండ్రి మక్సూద్‌ వద్దే ఉంటోంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మక్సూద్‌ కుటుంబం ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని సాయిదత్తా బార్‌దాన్‌ ట్రేడర్స్‌లోని భవనంలోనే నెల రోజులుగా ఉండిపోయింది. ఆ భవనంపైనే బీహార్ ‌కు చెందిన ఇద్దరు యువకులు ఉంటున్నారు. గురువారం సాయిదత్తా ట్రేడర్స్‌ యజమాని వచ్చేసరికి.. వీరెవరూ కనిపించకపోవడంతో గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా బావిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికితీసిన పోలీసులు.. మక్సూద్‌, నిషా, కుమార్తె (22), మనవడి(3)గా గుర్తించారు. ఎవరైనా హత్య చేశారా? వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయంలో స్పష్టత లభించడం లేదు. అయితే శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. ఇవాళ లభ్యమైన మూడు మృతదేహాల్లో మక్సూద్ కుమారుడు షాబాద్(22), బిహార్ కు చెందిన కార్మికుడు శ్రీరామ్ గా గుర్తించారు. మరొ మృత దేహం వివరాలు తెలియాల్సి ఉంది. బావిలో నీటిని అధికారులు బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.