TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెప్టెంబరు 17 చుట్టూ రాజకీయాలు

Published on: Sat Sep 17, 2016 11:40AM

 

ఒకప్పుడు సెప్టెంబరు 17 వచ్చిందంటే దాని ప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎవ్వరిని కదిపినా పుంఖానుపుంఖాలుగా దాని విశేషం చెబుతున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హైదరాబాద్‌ సంస్థానం అందులో విలీనం అయ్యేందుకు తిరస్కరించడం; దేశ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు, స్థానిక తిరుగుబాట్లను అణిచివేసేందుకు రజాకర్లను నియమించడం; నిజాం ప్రభువు అందడందలతో ఆ రజాకర్లు మారణహోమాన్ని సృష్టించడం... ఇవన్నీ ఇప్పుడు కరతలామలకమైన విషయాలు. కానీ ఇప్పుడు అయోమయంలో ఉన్నది మాత్రం పార్టీలే అని తోస్తోంది.

 

సెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహించేందుకు మొదట్లో సాక్షాత్తూ కేసీఆరే ఉత్సాహపడ్డారు. ఆ రోజుని తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా ఎందుకని జరపడం లేదంటూ ఒకప్పటి ప్రభుత్వాలను నిలదీశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస, మజ్లిస్‌ పార్టీలు రెండూ మౌనంగా ఉండిపోయాయి. దానికి కారణం- నిజం ప్రభువుని కానీ రజాకర్లని కానీ విమర్శిస్తే అది ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందన్న భయమే స్పష్టంగా కనిపిస్తోంది. పాలకపక్షం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండిపోవడంతో ప్రతిసారీ బీజేపీ మరింత దూకుడుగా విరుచుకుపడే అవకాశం లభిస్తోంది. విమోచనమో, విలీనమో, స్వాతంత్ర్యమో... ఏదో ఒక పేరుతో ఈ రోజుని అధికారికంగా నిర్వహించమంటూ ప్రజల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది.

 

 

నిజానికి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ-ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించడం ఒక చారిత్రాత్మక తప్పిదం.  హైదరాబాదు సంస్థానం, భారతదేశంలో విలీనం కావడంతో ఈ ప్రాంతానికి ద్రోహం జరిగిందనుకోవడం అమాయకత్వానికి పరాకాష్ట. ఆ విషయం అందరికీ తెలిసినా కూడా తెలియనట్లు ఉండటం రాజకీయ నేతలకే చెల్లింది. కానీ పర్యవసానంగా దేశ చరిత్రలోనే అపూర్వమైన ఒక ఘట్టం మసిబారిపోతోంది. హైదరాబాదు మీద భారతీయ సైన్యం చేసిన దాడి ఒక క్లైమాక్సు మాత్రమే! అప్పటివరకూ నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి రైతులు, కమ్యూనిస్టులు, మహిళలు, పేదలూ చేసిన పోరాటం సంగతి ఏమిటి? రాజుకి వ్యతిరేకంగా పీడిత ప్రజలు చేసే పోరాటాన్ని హిందూ-ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చూడటం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్నలకు కొన్ని పార్టీల దగ్గర ఎలాంటి జవాబులూ ఉన్నట్లు కనిపించవు. కాబట్టి మున్ముందు కూడా సెప్టెంబరు 17వ తేదీ వచ్చిన ప్రతిసారీ ఈ ముసుగులో గుద్దులాటలు తప్పవు!