మూడు పార్టీలది సెంటిమెంటే! దుబ్బాక ఓటరు ఎటో? 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక కాక రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. త్రిముఖ పోరులో గట్టెక్కేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని అస్త్రాలు బయటికి తీస్తున్నాయి. అయితే ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రధానంగా సెంటిమెంటునే రగిలిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల సానుభూతిని దక్కించుకుని ఎన్నికలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ ను నమ్ముకోవడం ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారింది.
  

అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పోటీ చేస్తున్నారు. రామలింగారెడ్డి మరణంతో ఆయన భార్యకు టిక్కెట్ ఇవ్వడంతో సెంటిమెంట్ పనిచేస్తుందని టీఆర్ఎస్ భావిస్తుంది. రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి పనులను చెబుతూనే సుజాతమ్మను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజల్లో సానుభూతి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రామలింగారెడ్డి కుటుంబంపై ఉన్న సానుభూతితో పాటు కేసీఆర్  సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దుబ్బాకలో తమను గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది.

 

ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి కూడా తన తండ్రి అయిన మాజీ మంత్రి, దివంగత చెరుకు ముత్యం రెడ్డి పేరునే నమ్ముకుంటున్నారు. తన తండ్రి  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాకలో అసలు అభివృద్ధి జరిగిందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదని ప్రచారంలో కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ముత్యం రెడ్డి పట్ల దుబ్బాక ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయన పేరు చెబితేనే కొందరు ఆయన్ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న నేతలంతా ముత్యం రెడ్డి పేరు చెబుతూనే జనాలను కలుస్తున్నారు. గతంలో దుబ్బాక నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి. 

 

బీజేపీ అభ్యర్థి రఘునందనరావు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన గత రెండు దఫాలుగా బీజేపీ అభ్యర్థిగా దుబ్బాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వమని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన రఘునందన్ రావును చట్టసభలోకి పంపాలనే మాటలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. రామలింగారెడ్డిని మూడు సార్లు గెలించామని.. ఈసారి మరో ఉద్యమకారుడికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఉద్యోగులు, యువతలో జరుగుతుందని తెలుస్తోంది. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సెంటిమెంట్ రగిలిస్తూనే... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటుతున్నా నిరుద్యోగులను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని రఘునందనరావు తన ప్రచారంలో విరుచుకుపడుతున్నారు. 

 

దుబ్బాక ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ ను రాజేస్తూ ప్రజల్లోకి వెళుతుండటం ఆసక్తిగా మారింది. అభ్యర్థుల సెంటిమెంట్ రాజకీయాలతో దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారని చెబుతున్నారు. అయితే మూడు పార్టీల సెంటిమెంట్ లో ఎవరికి ప్రజల సపోర్ట్ లభిస్తుందో చూడాలి మరీ...