సాకర్ లో సంచలనం.. అర్జెంటీనా పై సౌదీ అరేబియా విజయం
Published on: Wed Nov 23, 2022 6:53AM
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. మంగళవారం అర్జంటీనా, సౌదీ అరేబియాల మధ్య జరిగిన మ్యాచ్ లో పసి కూడా సౌదీ అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. వరల్డ్ ర్యాంకింగ్ లో 51వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా టైటిల్ ఫేవరెట్ జట్టు అర్జంటీనాను ఓడించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జంటీనాది మూడో స్థానం. అటువంటి జట్టను 51స్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఓడించడంతో అర్జెంటీనా అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అర్జెంటీనా తరుపున మెస్సీ మాత్రమే గోల్ కొట్టాడు. ఆట ప్రారంభమైన పదవ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ దాన్ని గోల్‌గా మలిచాడు. తొలి హాఫ్ మొత్తం అర్జెంటీనా ఆధిక్యంలో కొనసాగింది. అయితే.. రెండో అర్థభాగంలో సౌదీ అరేబియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థి గోల్ పోస్టుపై పదే పదే దాడులు చేశారు.
ఈ క్రమంలో 48వ నిమిషంలో సౌదీ అరేబియా ఫార్వర్డ్ ప్లేయర్ సలేహ్ అల్ షెహ్రీ తన జట్టుకు తొలి గోల్ అందించి స్కోరును 1-1తో సమం చేశాడు. మరికొద్దిసేపటికే మిడ్‌ఫీల్డర్ సలీం అల్ దవ్సారీ 53వ నిమిషంలో గోల్ చేయడంతో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆట చివరి వరకు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది సౌదీ అరేబియా . ఈ మ్యాచ్‌కు ముందు వరకు వరుసగా 36 మ్యాచుల్లో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న అర్జంటీనా కీలక మ్యాచ్ లో లయ కోల్పోయి పరాజయం పాలైంది.


