ఉమ్మారెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానంటున్న బాబు
Published on: Mon Mar 19, 2012 12:44PM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును భవిష్యత్తులో ఎమ్మెల్సీ చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాపు సామాజికవర్గం నుంచి రాజ్యసభ టిక్కెట్ ఆశిస్తున్న ఉమ్మారెడ్డికి చంద్రబాబు హామీ ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనతోపాటు కాపు సామాజికవర్గ నేతలందరూ తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. నిజానికి ఉమ్మారెడ్డి పేరును రాజ్యసభకు పరిశీలించాలని జిల్లా సీనియర్ నాయకులైన డాక్టర్ కోడెల శివప్రసాద్, లాల్ జాన్ భాషా కూడా ప్రతిపాదించారు. అయినా చంద్రబాబునాయుడు వీరి ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. రాజ్యసభకు పార్టీ తరపున సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ పేర్లను ఖరారు చేశానని అందువల్ల ఈసారి ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఏమైనా ఉమ్మారెడ్డికి రాజ్యసభ సీటు దక్కకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గం తమ అసంతృప్తిని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యక్తం చేస్తున్నాయి.


