TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయిరెడ్డిపై చెప్పులదాడి కేసులో కళా వెంకట్రావు అరెస్ట్.. విడుదల 

Published on: Thu Jan 21, 2021 9:54AM

విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించిన సమయంలో అయన వాహనంపై చెప్పులతో దాడి జరిగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావును గత రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. అయన భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసారు. అంతేకాకుండా ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు ఎవరికీ చెప్పలేదు. చివరికి ఆయనను చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడ ఆయనకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నట్లుగా చెప్పి.. స్టేట్‌మెంట్ తీసుకుని విడుదల చేశారు.

 

విడుదల అయిన తర్వాత కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదని అన్నారు. తాము ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతూనే ఉంటామని అయన అన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. రామతీర్థం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని కళా వెంకటరావు ప్రశ్నించారు.

 

ఇది ఇలా ఉండగా పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత బలవంతంగా కళా వెంకట్రావును అరెస్ట్ చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయన గురించి తెలిసిన వారు అయితే.. ఎవరితోనూ కళా కనీసం పరుషంగా కూడా మాట్లాడే వ్యక్తి కాదు. కనీసం గొంతు పెంచి గద్దించే స్వభావం కూడా ఆయనకు లేదు. సాధారణంగా రాజకీయాల్లో ఉండే నాయకులపై కనీసం రాస్తారోకో.. ధర్నా వంటి కేసులైనా ఉంటాయి. కానీ.. కళా వెంకట్రావు మొత్తం రాజకీయ జీవితంలో అయన మీద మాత్రం ఒక్క కేసు కూడా లేదు.. కానీ రామతీర్థం ఘటనలో ఎవరో విసిరిన వాటర్ బాటిళ్లు, చెప్పులు వేశారని.. దానికి కళా వెంకట్రావు కారణం అని ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ కేసులో ఇప్పటికే ఇతరుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కళాను కూడా అరెస్ట్ చేశారు.