కమిటీలతో కాంగ్రెస్ లో మొదలైన లొల్లి

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కమిటీల లొల్లి తీవ్రస్ధాయికి చేరింది.. నిన్నటి వరకూ అందరూ కలిసి పనిచేస్తామని, గద్దె దించడం ఖాయమని చెప్పిన నాయకులు కమిటీల ఏర్పాటు తర్వాత సీన్ మార్చేశారు.. సీనియర్లలో కొందరిని దూరం పెట్టిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వారికి పెద్ద పీట వేసింది.. దీంతో సీనియర్ నాయకులు అధిష్టానంపై గుర్రగా ఉన్నారు.. యువరక్తాన్ని ప్రోత్సహించడమంటే సీనియర్లను విస్మరించడం కాదని వారంటున్నారు.. వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్లు కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రచార కమిటీ నుంచి పక్కన పెట్టడం కంటే తనను చంచల్ గూడ జైల్లో పెడితే బాగుండేదని వీహెచ్ వ్యాఖ్యానించారు.. తమ పార్టీలోనే కొందరు కోవర్టులున్నారని, వారికి కేసీఆర్‌తో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.. తనకు పదవి వస్తే, తెరాసను ఓడిస్తాననే వాళ్ల భయమన్నారు.. త్వరలోనే వాళ్ల పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేస్తానన్నారు.. ఇక నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు.. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. మరి సీనియర్ల నుండి వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.