నవ్వుతూ ప్రాణం (సెల్ఫీ) తీసుకుంటున్నారు

ఒకప్పుడు ఫోటో కావాలంటే స్టూడియోకి వెళ్లి తీయించుకుని గంటల కొద్దీ వెయిట్ చేసి మరి ఫోటో చూసుకుని మురిసిపోయే వారు. ఇప్పుడు ఒకరి ఫోటో మరొకరు తీసే రోజులు పోయి ఎవరికి వారే తమ సెల్ఫీలు దిగే రోజులు వచ్చాయి. దగ్గితే సెల్ఫీ..తుమ్మితే సెల్ఫీ..నవ్వితే సెల్ఫీ..ఏడిస్తే సెల్ఫీ ఇలా చెప్పుకుంటూ పోతే చేతిలో సెల్లు..మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే చాలు సెల్ఫీల లోకంలో విహరిస్తోంది నేటి యువత. ఆధునిక సెల్‌ఫోన్ల పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాల్సిన యువత..ఇలా సెల్ఫీల మోజులో పడి ప్రాణాలను తీసుకుంటోంది. ఈ వింత వికృత సంస్కృతి అన్ని దేశాలతో పాటే భారత్‌లోకి అడుగుపెట్టింది. ఏదైనా వింతగా తోస్తే దానికి బానిసై పోవడం భారతీయుల బ్లడ్‌లోనే ఉంది.

మొన్నామధ్య సిక్స్‌ప్యాక్, సైజ్ జీరో అంటూ కడుపు మాడ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువత తాజాగా సెల్ఫీ మాయలో పడి నవ్వుతూ ప్రాణాలు పొగోట్టుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఇతర దేశాలతో పోలిస్తే సెల్ఫీ మృతులు, బాధితుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారని తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మృతుల్లో 50 శాతం మంది భారతీయులే. ఈ ఏడాది అయితే దేశంలో వారానికి ఒకరు చొప్పున సెల్ఫీకి బలవుతున్నారు. సెల్ఫీ తీసుకునే సమయంలో పరిసరాలను పట్టించుకోకపోవడం..ధ్యాస మొత్తం కెమెరా పైనే ఉంచడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా ఎత్తులో నుంచి పడిపోయి, నీటిలో మునిగిపోయిన వారు కొందరైతే, కారు, రైలు, విమాన, తుపాకీ ప్రమాదాల్లోనూ, జంతువుల కారణంగాను ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

చెన్నైలో ఇంటర్మీడియట్ చదవుతున్న సుకుమార్ స్నేహితులతో కలిసి రైలు పట్టాలపై వస్తూ సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డాడు. వేగంగా వస్తున్న రైలు బ్యాక్‌డ్రాప్‌లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైలు వేగాన్ని పట్టించుకోకపోవడంతో అదుపుతప్పి అదే రైలు కిందపడి దుర్మరణం పాలయ్యాడు. విశాఖపట్నానికి చెందిన మరో కుర్రాడు..స్నేహితులతో సరదాగా రాజమండ్రి వెళ్లాడు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండటంతో పునకం వచ్చినట్టు స్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు ఇంజన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంజన్‌‌పై నున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి బెడ్డుపై మృత్యువుతో పోరాడి మరణించాడు. జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వని యువత మరింత విశృంఖలంగా సెల్పీ వలలో పడుతున్నారు.

తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ రైల్వే వంతెన వద్ద ఓ యువకుడు వేగంగా వస్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీ దిగబోయి ప్రమాదవశాత్తూ మరణించాడు. పదేళ్ల బాలల నుంచి డెబ్బయేళ్ల వృద్ధుల వరకు సెల్ఫీలు దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెల్ఫీ అనేది ఒక తీయని జ్ఞాపకంగా నిలిచిపోవాలే తప్ప ప్రాణాంతకంగా మారకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీ తారలు ఇలా మనం అభిమానించే వ్యక్తులు తారసపడిన సందర్భంగా వారితో కలిసి సెల్ఫీలు దిగడం సరదా..గొప్ప వ్యక్తులను కలుసుకున్న క్షణాలను పదిలంగా దాచుకునేందుకు సెల్ఫీలు ఉపయోగపడతాయి. 

 

కారణం ఎవరు:
అందరి కంటే వింతగా, అందరి కంటే ముందుగా, సరికొత్తగా ఓ సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‌ వాల్ ఎక్కెద్దామనుకుంటారు. దీనికి ప్రధాన కారణం వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియాతో పాటు చుట్టూ ఉన్న స్నేహితులు కూడా. రెచ్చగొట్టే మాటలతో, పౌరుష పదజాలంతో ప్రాణాలతో చెలగాటం ఆడేలా మిత్రులను ముందుకు నెడుతున్నారు. అంతే ప్రాణాంతక సాహసాలతో సెల్ఫీలు దిగి వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పెట్టి మురిసిపోతున్నారు. ఇలాంటి సాహసాలు తప్పని చెప్పక పోగా..వాటిని అభినందిస్తూ "వావ్", అనో "సూపర్బ్" అనో కామెంట్లు వస్తుండటంతో సెల్ఫీ పిచ్చి మరింత వేలం వెర్రిగా మారిపోయింది.

 

ఒక సెల్ఫీ దిగితే వచ్చేదేంటి..? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మహా అయితే ఓ పది లైకులు, ఓ ఐదు కామెంట్లు..అంతే. మార్కెట్ మాయలో పడిన ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం..సహజీవనం రాబోయే కాలంలో మనిషిని పిచ్చోడిని చేసేంత ప్రమాదకారిగా మారోబోతోందనేది నిపుణుల ఆందోళన.