సెల్ఫీలతో సంతోషం!

సెల్‌ఫోన్‌ చేతిలో ఉండి సెల్ఫీ దిగనివారు అరుదు. అందులోనూ కుర్రకారు సంగతైతే చెప్పనే అక్కర్లేదు. వీలైనంత వింత సెల్ఫీ దిగేందుకు వారు చేయని సాహసం అంటూ ఉండదు. సెల్ఫీలు మన విచక్షణని దెబ్బతీస్తున్నాయనీ, శవాలతో కూడా సెల్ఫీలు దిగేస్తున్నారని పెద్దలు విసుక్కోవడం కొత్తేమీ కాదు. ఇక సెల్ఫీల వల్ల వచ్చే మానసిక రోగాల గురించి వెలువడే పరిశోధనలూ తక్కువేమీ కాదు. కానీ ఇప్పుడు సెల్ఫీలు సంతోషానికి దారితీస్తాయంటూ తేల్చిన ఒక పరిశోధన సంచలనం కలిగిస్తోంది.

 

కుర్రకారు మీద పరిశోధన

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన యూచెన్‌ అనే పరిశోధకురాలు తమ విశ్వవిద్యాలయంలోని 41 మంది విద్యార్థులను ఈ పరీక్ష కోసం ఎన్నుకొన్నారు. సాధారణంగా, చదువుకోవడం కోసం ఇల్లు వదిలి వచ్చే విద్యార్థులు రకరకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, కొత్త పరిసరాలకు సర్దుకుపోలేకపోవడం, శ్రమతో కూడిన చదువు... ఇవన్నీ కూడా వారిని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తూనే ఉంటాయి. వీటివల్ల విద్యార్థులు చదువులో వెనకబడటమే కాదు, ఒకోసారి డిప్రెషన్‌లో సైతం కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదు.

 

సెల్ఫీల ప్రభావం

తన పరిశోధనలో భాగంగా యూచెన్‌ ఈ 41 మంది విద్యార్థులనూ తమ ఫోన్లతో మూడు రకాలైన ఫొటోలను తీస్తూ ఉండమని చెప్పారు. ఒకటి- తాము నవ్వుతూ దిగిన సెల్ఫీలు; రెండు- తమకి నచ్చి, ఇతరులతో పంచుకోవాలనుకునే వస్తువుల ఫొటోలు; మూడు- ఇతరులు సంతోషపడతారనుకునే సన్నివేశాల తాలూకు ఫొటోలు. ఈ మూడు రకాల ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో పంచుకోమని ప్రోత్సహించారు. ఇలా ఫొటోలు తీయడంతో పాటుగా, తమ ఉద్వేగాలను (moods) ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేలా వారి ఫోన్లలో ఒక యాప్‌ను కూడా ఏర్పాటుచేశారు పరిశోధకులు.

 

ఊహించని ఫలితం

ఓ నాలుగువారాల పాటు అభ్యర్థులు నమోదుచేసిన 2,900 ఉద్వేగాలను గమనించిన తరువాత ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. ఎప్పటికప్పుడు నవ్వుతూ సెల్ఫీలను దిగిన విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెరిగిందట. తరచూ నవ్వడానికి వారు అలవాటుపడ్డారట. ఇక ఇతరులతో పంచుకునేందుకు తమకు ఇష్టమైన ఫొటోలను పంపించేవారిలో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరిగిందట. ఇతరులకి నచ్చే ఫొటోలు తీసినవారిలో, సామాజిక సంబంధాలు మెరుగుపడ్డాయట.

 

ఇప్పటిదాకా సెల్ఫీల ప్రతికూల లక్షణాల గురించే పరిశోధనలన్నీ వెలువడ్డాయనీ, దానికి ఉన్న మంచి లక్షణాలను కూడా గమనించేందుకే ఈ పరిశోధన చేప్టటామనీ... విశ్వవిద్యాలయంలోని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా కాలేజీ విద్యార్థుల చేతిలో నిరంతరం ఉండే ఫోన్లని, ఒత్తిడి నివారించేందుకు కూడా ఉపయోగించవచ్చునని సూచిస్తున్నారు ముఖ్యపరిశోధకురాలైన యూచెన్‌. ఆ విషయం మనం కుర్రకారుకి వేరే చెప్పాలా!

 

- నిర్జర.