ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిట్కా

మనిషి సాధించే విజయాలలో ఆత్మవిశ్వాసానిదే ముఖ్య పాత్ర. ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే, ఎంత ప్రతిభ ఉన్న ఫలితం గుండుసున్నాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలన్నా, తోటివారిని దాటుకుని దూసుకుపోవాలన్నా ఆత్మవిశ్వాసమే కీలకమంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులంతా తెగ ఊదరగొట్టేస్తుంటారు. అయితే అతి సులభంగా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే చిట్కా ఒకదాన్ని పరిశోధకులు రూపొందించారు.

 

ఆత్మవిశ్వాసాన్ని కొలిచారు

జపానులోని క్యోటో నగరానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వారు ఓ 17 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరితో చిన్నా చితకా పనులు చేయిస్తూ, ఆ సమయంలో వారి మెదడు పనితీరుని పరీక్షించారు. Decoded Neurofeedback అనే ఈ పరీక్ష ద్వారా వారు అభ్యర్థి మెదడులో ఆత్మవిశ్వాసపు స్థాయి ఏ తీరున ఉందో గమనించారు.

 

బహుమతులు అందించారు

అభ్యర్థులు కొన్ని పనులు చేసేటప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు గమనించారు. అలాంటి సమయంలో వారికి కొన్ని బహుమతులు అందించారు. పరిశోధకులు తమకు బహుమతులు ఎందుకు ఇస్తున్నారో అభ్యర్థులకు తెలియలేదు. కానీ వారి మెదడు మాత్రం ఆ ప్రతిఫలం పట్ల మంచి ఉత్తేజాన్ని పొందింది. అలా అభ్యర్ధికి తెలియకుండానే అతనిలో ఆత్మవిశ్వాసపు స్థాయిని పెంచే ప్రయత్నం చేశారన్నమాట. ఆత్మవిశ్వాసపు స్థాయి హెచ్చుగా ఉన్నప్పుడల్లా వారికి ఏవో ఒక పారితోషికాన్ని అందచేయడం వల్ల... ఆత్మవిశ్వాసం బలపడినట్లు గ్రహించారు.

 

పెంచాలన్నా – తగ్గించాలన్నా

ఇదే పద్ధతిని వ్యతిరేక దిశలో చేస్తే కనుక ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అంటే మన మెదడులో ఆత్మవిశ్వాసం ఉండే స్థాయిని బట్టి, మనకి అందే ప్రతిఫలాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయన్నమాట. ఈ పద్ధతిని ఉపయోగించి మున్ముందు మానసిక శాస్త్రవేత్తలు ఆత్మన్యూనతతో బాధపడేవారికి కొత్త జీవితాన్ని అందించవచ్చునని అంటున్నారు. డిప్రెషన్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారికి కనుక ఈ తరహా చికిత్సని అందిస్తే... వారి జీవన విధానం మెరుగవుతుందని ఆశిస్తున్నారు.

 

ఈ పరిశోధన కేవలం నిపుణులకే పరిమితం అయినా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేకపోలేదు. ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులకు వారి చిన్నచిన్న విజయాలలో తోడుగా నిలబడి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పాదుకునే అవకాశం ఉంది. అలాగే బెరుకుగా, భయంగా ఉండే చిన్నపిల్లలకి ఏవో ఒక ప్రోత్సాహకాలు అందిస్తూ వారు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరనే నమ్మకాన్ని కలిగించగలిగితే...  వారి జీవితానికి ఓ భరోసాని అందించినవారమవుతాం. 

- నిర్జర.