శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికింది రూ. 12 లక్షలేనట.. మరి వైసీపీ అలా చెప్పిందేంటబ్బా? 

 

వైఎస్ జగన్‌ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ విమర్శలకు ప్రధాన కారణం చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి.

వైసీపీ ప్రతిపక్షములో ఉన్న సమయంలో శేఖర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. శేఖర్ రెడ్డి వద్ద వందల కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఆయన పలువురు రాజకీయ నేతలకు బినామీ అని, ఆయన దగ్గర వందకోట్లు తీసుకొని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిందని.. అబ్బో ఇలా ఎన్నో విమర్శలు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్ అయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. గతంలో ఏ శేఖర్ రెడ్డి మీద విమర్శలు చేసిందో.. ఇప్పుడదే శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ముందుకెళ్తోంది.

మరోవైపు శేఖర్ రెడ్డి కూడా తనకే పాపం తెలీదు, తాను ఉత్తముడిని అంటున్నారు. నేడు టీటీడీ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు, పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని దేవుడే చూసుకుంటారు అన్నారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 25 ఏళ్ళుగా శ్రీవారి సేవలో తరిస్తున్నానను. ఆరేళ్లుగా ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు పుష్పాలు సమర్పిస్తున్నాను. రూ. 15 కోట్లతో అలిపిరిలో నిర్మిస్తున్న గోశాల నిర్మాణానికి పూర్తిగా నేనే నిధులు ఇచ్చాను. స్వామి వారికి ఎన్నో విరాళాలు ఇచ్చాను అంటూ శ్రీవారి మీద తనకున్న భక్తిని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇన్ కం టాక్స్ రైడ్ జరిగిన నాడు నా ఇంట్లో కేవలం రూ. 12 లక్షలు మాత్రమే దొరికాయని అన్నారు. ఇప్పటికైనా నాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయండని శేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరి శేఖర్ రెడ్డి చెప్తున్నట్లు.. ఆయన ఇంట్లో కేవలం రూ. 12 లక్షలు మాత్రమే దొరికితే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆయన ఇంట్లో వందల కోట్లు దొరికాయని ఎందుకు ప్రచారం చేసినట్టు? మళ్లీ అదే శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి పాలకమండలిలో ఎందుకు నియమించినట్టు? అంతా ఆ ఏడుకొండల వాడికే తెలియాలి.