సెహ్వాగ్‌ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా..?

బౌలర్ ఎలాంటి వాడైనా.. బంతిని బౌండరీ దాటించడమే పనిగా ఎదురుదాడికి దిగడం.. 299  పరుగుల వద్ద కూడా క్రీజు నుంచి బయటికి వచ్చి సిక్సర్ కొట్టగల తెగింపు ఒక్కడికే సొంతం.. ఆ ఆటగాడు ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయనే భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. రెండు ట్రిపుల్ సెంచరీల మొనగాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆధునిక క్రికెట్‌లో ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటాన్ని పరిచయం చేసిన సెహ్వాగ్ అంటే బౌలర్లకు వణుకు. ఎక్కడ తమను ఊచకోత కోస్తాడేమోనని.. అందుకే వీరేంద్రుడు క్రీజులో ఉండగా బౌలింగ్ వేయడానికి దిగ్గజ బౌలర్లు కూడా భయపడేవారు. మరి అలాంటి సెహ్వాగ్‌నే భయపెట్టిన బౌలర్ ఒకరున్నారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలంక వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అంటే తనకు చాలా భయంగా ఉండేదని పేర్కొన్నారు. మురళీ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ముఖ కవళికలు తనను భయపెట్టేవని.. బౌలింగ్ చాలా కఠినంగా ఉండి.. షాట్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. దీంతో ఎక్కడ అవుటైపోతానన్న భయం ఉండేదన్నాడు. అతడు ఒక్కడు తప్ప మరే బౌలర్ తనను భయపెట్టలేకపోయాడని సెహ్వాగ్ అన్నాడు.