'తెలంగాణ విషయంలో నలుగురు ముద్దాయిలు'
Published on: Sat Dec 24, 2011 8:26AM
హైదరా
బాద్: సీమాంధ్ర నేతలను పగటి వేషగాళ్ళతో తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె.తారక రామారావు పోల్చారు. అలాగే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలకు వెన్నెముక లేదన్నారు.జెఏసి పిలుపు మేరకు తెలంగాణ విద్రోహ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ఆయన మాట్లాడుతూ ఈ పగటి వేషగాళ్లు,వెన్నెముకలేని లేని నేతలు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు.ఉద్యమానికి ఇది విరామమే కాని అంతం కాదన్నారు. 2014లో తెలంగాణ నినాదం మరోసారి రాకుండా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పు అని అది ఎప్పటికీ చల్లారదన్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికైనా కేంద్రం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విషయంలో నలుగురు ముద్దాయిలు ఉన్నారన్నారు.రాష్ట్రానికి అడ్డుపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ముద్దాయి, వాగ్ధానాలు ఇచ్చి వెనక్కి పోయిన రాజకీయ పార్టీలు రెండో ముద్దాయి, సీమాంధ్ర పెట్టుబడిదారులు మూడో ముద్దాయి, వెన్నెముకలేని ప్రజాప్రతినిధులు నాలుగో ముద్దాయని విమర్శించారు. తెలంగాణకు త్వరలో ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యమ నాయకులు మౌనంగా ఉన్నారని ఇదే సమయంలో రెచ్చి పోవాలని చూస్తే గోడకు వేళాడే తుపాకి కూడా గర్జించినపుడే దాని పనితనం తెలుస్తుందని హెచ్చరించారు. ప్రజలకు సరైన సమయమొచ్చినపుడు ఈ తరహా నేతల భరతం పడతారని కేటీఆర్ జోస్యం చెప్పారు.


