రాష్ట్ర విభజన అంటే కష్టమే మరి

 

కేంద్రమంత్రుల బృందంతో తెలంగాణా కేంద్రమంత్రుల సమావేశం ముగియగానే, సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. ఊహించినట్లుగానే వారు రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలను ఏకరువు పెట్టివచ్చామని మీడియాకు తెలిపారు. అయితే తాము సీమాంధ్ర కోసం ప్యాకేజి ఏమయినా కోరారా లేదా? అనే విషయం మాత్రం బయటపెట్టలేదు. కానీ ప్యాకేజి కోరితే తప్పేమిటని అడుగుతున్న వారు తమ డిమాండ్లను కేంద్రమంత్రుల బృందం చేతిలో పెట్టరాని అనుకోలేము.

 

వారి తరువాత ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రుల బృందం తో సమావేశమవుతున్నారు. ఆయన కూడా రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తానని ముందే ప్రకటించినందున కొత్త విశేషాలేవి ఉండకపోవచ్చును.

 

శంఖంలో పోస్తే కాని నీళ్ళు తీర్ధంగావన్నట్లు, ఇప్పుడు ఆయన అధికారిక హోదాలో, రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన అధికారిక కేంద్రమంత్రుల బృందం ముందు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ వాదనలు చేసిన తరువాత, ఇక కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యామ్నాయ అస్త్రాలను అంటే ముఖ్యమంత్రి మార్పుకి సిద్దపడవచ్చును. ఇప్పటికే కోట్లని, కన్నాని ప్లాట్ ఫారం పైకి తెచ్చేందుకు అంతా సిద్దం చేసి ఉంచింది గనుక వారిలో ఎవరో ఒకరిని ఎప్పుడయినా రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా నియమించవచ్చును. అయితే ఆ ముహూర్తం శాసనసభకు తెలంగాణా బిల్లు పంపక మునుపా? లేక పంపిన తరువాత అనేది మాత్రమే తేలవలసి ఉంటుంది.