ఎన్నికలకు సీమాంద్ర సర్వం సిద్దం

 

సీమాంద్రాలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి లోక్ సభకు 333మంది, అసెంబ్లీకి 2241 అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో 3,67,62,975 మంది ఓటర్లు ఈ అభ్యర్ధుల భవితవ్యం తేల్చనున్నారు. రేపు జరుగబోయే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ చాలా విస్త్రుత ఏర్పాట్లే చేసింది. 13 జిల్లాల్లో మొత్తం 40,708 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 13వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దాదాపు లక్షా ఇరవవేల మంది పోలీసులతో కనీ వినీ ఎరుగని రీతిలో చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా 84 హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 2 హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్‌ను నక్సల్ ప్రభావిత ప్రాంతమయిన పాడేరు ప్రాంతానికి కేటాయించారు. అదేవిధంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా దాదాపు 60 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలయిన తెదేపా, వైకాపాలకు చాలా కీలకమయినవి గనుక ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల నడుమ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండవచ్చనే ఆలోచనతోనే ఇంత భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వస్తోంది.

 

ఇక రాష్ట్ర విభజన తరువాత ఒక సంధికాలంలో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరికి విజయం దక్కుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇంత మంది పోటీ చేయాలనుకోవడం విశేషమే. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రానట్లయితే, అప్పుడు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన గెలిచినవారే కింగ్ మేకర్స్ అవుతారు. బహుశః అందుకే ఈ సారి ఇంతమంది బరిలో దిగి ఉండవచ్చును. అయితే ఈసారి ఇంతగా పోరాటం చేసిన తరువాత ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన దానికి పెనుసవాళ్లు ఎదుర్కోక తప్పదు. ఆరు నూరయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదు.