సీమాంధ్ర నేతలకి కాంగ్రెస్ ఎర

 

రానున్నఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసినా చేయకున్నా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయం. రాష్ట్ర విభజనను పార్లమెంటు ఆమోదిస్తేనే గానీ అడుగు ముందుకు వేయలేదని తెలిసి ఉన్నపటికీ, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ భారీ నిధులను కేటాయిస్తూ ప్రకటించవచ్చును. అయితే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేవరకు అది మీడియా ప్రకటనలకి, కాగితాలకే పరిమితమవుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ వ్యూహం మాత్రం చక్కగా ఫలిస్తుంది.

 

వాటిని దక్కించుకోవడం కోసం భారీ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొంటూ ‘పార్ట్ టైం ప్రజాసేవ’ చేసుకొంటున్న సీమాంధ్రలో అన్నిరాజకీయ పార్టీల యంపీలు, మంత్రులు, శాసన సభ్యులు, రాజకీయ నేతలు పైరవీలు మొదలుపెడతారు గనుక, వారిని లొంగ దీసుకోవడం తేలికవుతుంది. ఈ సారి సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని గెలవడం అసాద్యం. స్థానిక మంత్రులు, యంపీలు, శాసన సభ్యుల వ్యక్తిగత పలుకుబడి, ప్రజాదరణ, కుల సమీకరణాలు, డబ్బు వగైరా అంశాలపైనే కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంటుంది. గనుక ముందుగానే వారికి ఈ కాంట్రాక్ట్ ఎరలు వేసి లోబరచుకొంటే వారి గెలుపుకోసం వారే తిప్పలు పడి గెలిస్తే, గండం గట్టేక్కవచ్చును. ఒకవేళ వారు గెలిచినా గెలువకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే తన ఏర్పాట్లు తను చేసుకొని తన జాగ్రత్తలో తను ఉంది.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతోనే సగం విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం చేసే హడావుడితో తెలంగాణా ప్రజలకు తెలంగాణా ఏర్పడుతుందనే నమ్మకం కలిగిస్తూ చివరికి రాష్ట్ర విభజన చేయకుండానే ఎన్నికలకి వెళ్ళవచ్చును. ఆవిధంగా చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి మూడు ప్రయోజనాలున్నాయి.

 

1. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే మిగిలిన ప్రక్రియ వేగంగా పూర్తవుతుందనే ప్రచారం చేసుకొని తెలంగాణాలో గెలిచే అవకాశం ఉంది.

 

2. ఇంత క్లిష్టమయిన సమస్యను ఇంత హడావుడిగా పరిష్కరించేకంటే, ఎన్నికలలో గెలిస్తే తాపీగా చేసే వెసులుబాటు దొరుకుతుంది.

 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరముంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేకపోయినా, భారీగా నిధులు మంజూరు చేసేయడం వలన సీమాంధ్ర ప్రజలు, నేతలు అందరూ కూడా చల్లబరచవచ్చును. కానీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోతే, సరిగ్గా ఇదే అంశం ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి శాపంగా మారుతుంది.