మంత్రులు, యంపీలు రాజీనామా డ్రామాలు

 

రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందుగానే తెలిసినప్పటికీ తెలియనట్లు నటిస్తూ ఇంతకాలం పదవులలో కొనసాగిన మంత్రులు,యంపీలు ఇప్పుడు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ రాజీనామాలు చేయడం కూడా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికే. బహుశః ఇది కూడా అధిష్టానం కనుసన్నలలోనే జరిగి ఉండవచ్చును.

 

కేంద్రమంత్రి పదవి ఈయలేదని అలిగిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావుని కేంద్రమంత్రి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా తీసుకొన్నారు. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అప్పటికే స్పష్టం అయినందున వర్కింగ్ కమిటీలోఉంటే ఆ నిర్ణయానికి తను కూడా అమోదముద్ర వేయవలసి ఉంటుంది గ్రహించిన కావూరి, దానివల్ల తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ముందు చూపుతోనే కేంద్ర మంత్రి పదవిని అట్టేబెట్టుకొని వర్కింగ్ కమిటీ సభ్యత్వం వదులుకొన్నారు. ఆ వెంటనే ఆయన “కేంద్రమంత్రిగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని” ప్రకటించడం గమనిస్తే ఆయనకి అప్పటికే రాష్ట్రవిభజన నిర్ణయం అయిపోయినట్లు తెలుసన్నసంగతి అర్ధం అవుతోంది. మరి ఆయనకి తెలిసిన ఈ విషయం మిగిలిన యంపీలకి, కేంద్రమంత్రులకి తెలియదని భావించలేము.

 

ఇప్పుడు కొందరు నేతలు పార్టీలు మారడానికి దీనినొక సదవకాశంగా భావించి రాజీనామాలు చేస్తే, ఇంకొందరు అధిష్టానం అనుమతి తీసుకొని, మరికొంతమంది ప్రజల పోరు భరించలేక రాజినామాలు చేస్తున్నారు తప్ప వారి రాజినామాలలో నిజాయితీ లేదు. అటువంటి నేతలు, రాజకీయ నాయకులూ ఇంకా రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని పలుకుతున్న ఉత్తరకుమార ప్రగల్భాలు కూడా సీమంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే.

 

ఇక ఇప్పటి నుండి ఈ సదరు నేతలు విభజన ప్రక్రియలో ప్రతీ అంచెలో తాము అడ్డుకొంటునట్లు నటించడం మొదలుపెట్టబోతున్నారు. తద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకొని తమ రాజకీయ జీవితం దెబ్బతినకుండా చూసుకొందామనే తాపత్రయమే తప్ప నిజంగా అడ్డుకోవాలనే ఆలోచనతో మాత్రం కాదని ప్రజలు గ్రహించాలి. ఈ లోగా వివిద అంశాలను పరిష్కరించేందుకు ఏర్పాటయ్యే క్యాబినెట్ మంత్రి మండలితో సీమంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు యుద్ధం చేస్తున్నట్లు కూడా నటించవచ్చును. వారు ఈ డ్రామాలు రెండు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఏర్పడేవరకూ కూడా కొనసాగిస్తూనే ఉంటారు.

 

అయితే రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని సీమంధ్ర ప్రజలు, ఉద్యోగులు కూడా ఎంత త్వరగా జీర్ణించుకోగలిగితే అంత మచిది. ఇంతవరకు వచ్చిన తరువాత ఏ ప్రభుత్వము, పార్టీ కూడా తన నిర్ణయాన్నిఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొనే అవకాశం లేదనే సంగతి వారు గ్రహించాలి. అందువల్ల రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నాలకు బదులు, సీమంధ్ర ప్రాంతం, ప్రజలు నష్టపోకుండా ఏమిచేయాలని ఆలోచనలు చేయడమే తక్షణ కర్తవ్యం.