సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు ఇంకాస్త గట్టిగా దిక్కార స్వరం వినిపించడం ద్వారా, ఇక రెండు నెలలుగా సాగుతున్నఈ విభజన సీరియల్ కి ఏదో ఒక ముగింపు తీసుకువచ్చే పరిస్థితి కల్పించారు. రాష్ట్ర విభజనపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని నేడు కూడా దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన నేపధ్యంలో, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమేనని అందరికీ తెలుసు. గనుక, సమైక్యాంధ్ర కోసం కాకపోయినా తమ రాజకీయ మనుగడ కోసమయినా వారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడక తప్పదు.

 

ఇప్పటికే యంపీ యస్పీవై రెడ్డి వైకాపాలోకి దూకేయగా, మంత్రి విశ్వరూప్ కూడా నేడో రేపోవైకాపాలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ధీర గంభీరంగా సమైక్యవాదం చేసినా, అంతిమంగా తన రాజకీయ భవిష్యత్ కూడా చూసుకోక తప్పదు. అందుకే ఆయన పదవి నుండి తప్పుకొని ఏదో ఓ రూపంలో ఉద్యమంలో పాల్గొనవచ్చును.

 

అయితే ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రజలతోనో, ఉద్యోగులతోనో కలిసి ఉద్యమాలు చేయడం ఇబ్బందికరం గనుక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి కొత్తపార్టీ స్థాపించి పోరాడవచ్చును. గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు విభజన జరిగితే కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తామని ప్రకటించారు. గనుక సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి ఓ కొత్త పార్టీ పెట్టుకోవచ్చును.

 

అయితే సీమంధ్ర నేతలు కొందరు కొత్త పార్టీలోకి, మరికొందరు వైకాపాలోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ మనుగడ ఎలా అంటే బొత్స సత్యనారాయణ, చిరంజీవి, శీలం, సుబ్బిరామి రెడ్డి, పురందేశ్వరి, పనబాక, కిల్లి కృపా రాణి, కావూరి వంటి సీనియర్లను ఉపయోగించుకొని కాంగ్రెస్ అధిష్టానం సీమంద్రాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. అయితే వారి వల్ల పార్టీ ఎన్నికలలో గెలుస్తుందని చెప్పలేకపోయినా అభ్యర్ధులను రంగంలో దింపేందుకు మాత్రం డోకా ఉండకపోవచ్చును. పార్టీలో సీనియర్లు తప్పుకొంటే పోటీ చేసేందుకు ఇప్పటికే అనేక మంది కొత్త అభ్యర్ధులు సిద్ధంగా ఉన్నారు.

 

రాష్ట్ర విభజన చేయడం వలన సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినా, పార్టీ తాత్కాలికంగా చీలినా, ఈ భావోద్రేకాలు ఎక్కువకాలం ఉండే అవకాశం లేదు. ఎన్నికలలోగా రెండు మూడు సమైక్యాంధ్ర పార్టీలు పుట్టుకు రావడం వలన ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూరుస్తుందనే ధీమా కూడా కాంగ్రెస్ లో ఉంది. ఇప్పుడు సీమంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీ నుండి వేరయినా, ఎన్నికలు పూర్తయిన తరువాత అధికారం పంచుకోవడం కోసమయినా మళ్ళీ వెనక్కుతిరిగి రావచ్చుననే నమ్మకంతోనే కాంగ్రెస్ అధిష్టానం అంత దైర్యంగా రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేస్తోందని చెప్పవచ్చును. ఇక, జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ఎలాగు ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడమో లేక ఎన్నికలు పొత్తులు పెట్టుకొని అధికారం పంచుకోవడమో ఖాయం గనుక సీమంద్రాలో పార్టీ పరిస్థితి గురించి కాంగ్రెస్ అధిష్టానం బెంగాపెట్టుకోలేదు. .