తెలంగాణా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం త్వరలో

 

 

ఇంతవరకు తెలంగాణాలో, ఇప్పుడు సీమాంధ్రలో ప్రజలు ఉద్యమిస్తున్నపుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రెండు వర్గాలుగా చీలి ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ రాష్ట్రాన్నిరావణకాష్టంగా మార్చడంలో తమ వంతు కర్తవ్యం చాల చక్కగా నిర్వహించారు. విభజన తరువాత తెరాస, తెదేపా, వైకాపాలు మూడు చరిత్ర పుటల్లోకలిసిపోతే, రెండు ప్రాంతాలలో తమ పార్టీయే ఏక చత్రధిపత్యం వెలగబెట్టేయవచ్చునని కాంగ్రెస్ కలలుకంది. కానీ, రాష్ట్రంలో కధ అడ్డం తిరిగింది.

 

విభజన చేయనందుకు తెలంగాణా ప్రజలు, చేస్తున్నందుకు సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రకటన వెలువడినప్పుడు టీ-కాంగ్రెస్ నేతలకి నీరాజనాలు పట్టిన అక్కడి ప్రజలు, ప్రకటన వెలువడిన 50రోజుల తరువాత కూడా విభజన ప్రక్రియ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పడిఉండటంతో, వారిని అనుమానంగా చూస్తున్నారు.

 

ఇక, విభజన జరుగుతోందని ముందుగానే తెలిసి ఉన్నపటికీ దానిని అడ్డుకోకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉద్యమాలు సమ్మెలు చేస్తుంటే, నేతలు మాత్రం ఇప్పటికీ తమ పదవులను పట్టుకొని వ్రేలాడుతుండటంతో ప్రజలు వారిని తరిమికొడుతున్నారు.

 

విభజనతో మట్టి కొట్టుకుపోతాయని భావించిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా మరింత బలపడి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అసలు దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నాయి. కాంగ్రెస్ అనుకొన్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఇక, ఇదేవిధంగా ముందుకు సాగితే రానున్నఎన్నికలలో గెలవడం సంగతి దేవుడెరుగు, కనీసం ప్రజల మధ్యకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించిన సీమాంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈ సమస్యలనుండి బయటపడేందుకు తమ మధ్య ఉన్న ప్రాంతీయ విభేదాలను పక్కన బెట్టి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని నిశ్చయించుకొన్నారు. బహుశః ఈ రెండు మూడు రోజుల్లోనే వారు సమావేశమవ్వవచ్చును.

 

రాష్ట్ర విభజనలో తలెత్తే సమస్యల గురించి చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన ఏవిధంగా చేయవచ్చుననే అంశంపై వారు చర్చించబోతున్నట్లు సమాచారం. విభజన సంగతి చర్చించడం సంగతి ఎలా ఉన్నపటికీ వారందరూ ముందుగా తమపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కోవాలి? రెండు ప్రాంతాలలో తమ పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలి? రెండు ప్రాంతాలలో ప్రజలకు ఏవిధంగా నచ్చజెప్పాలి? వంటి అంశాలను చర్చించడానికే ప్రాధాన్యం ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతుంటే, కాంగ్రెస్ నేతలు తమ సమస్యలను చర్చించుకోవడానికి రెండు ప్రాంతాలలో తమ పార్టీని కాపాడుకోవడానికి సమావేశం అవబోడం ప్రజలకు మరింత ఆగ్రహం కలిగించవచ్చును.

 

రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు ఇంతవరకు డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం అమలుచేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి ఐకమత్యమే మహాబలమని తన ఇరు ప్రాంతాల నేతలను ఒకచోటకు చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషమే.