అఖిల ప్రియకు మరో షాక్!

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసుని నమోదు చేశారు. దీంతో జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావంటూ సికింద్రాబాద్ కోర్టు బెయిల్ పిటిషన్ రిటర్న్ చేసింది. సికింద్రాబాద్ కోర్టు తోసిపుచ్చడంతో నాంపల్లి కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వేయనున్నారు. 

 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇవాళ విచారణ చేపట్టారు. ఇప్పటికే అఖిలప్రియను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, అఖిలప్రియ ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమెను విడుదల చేస్తే పరారీలో ఉన్న ఆమె భర్త, ఇతరులు దొరక్కపోవచ్చని, కేసు దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన సికింద్రాబాద్ కోర్టు.. ఈ కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసినందున తాము బెయిల్ ఇవ్వలేమని, పై కోర్టుకు వెళ్లాలంటూ అఖిలప్రియకు సూచించింది. ఈ నేపథ్యంలో, నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది నిర్ణయించుకున్నారని సమాచారం.