TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం జ‌గ‌న్ సీక్రెట్ స‌ర్వే.. 50 మంది ఎమ్మెల్యేల‌కు షాక్‌!

Published on: Tue Mar 15, 2022 6:09PM

అద్దాల మేడలో కూర్చుంటే, అంతా బాగున్నట్లే కనిపిస్తుంది. మేడ దిగి వస్తేనే నిజం ఏమిటో తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గడచిన మూడేళ్ళలో అంతగా జనంలోకి వెళ్ళింది లేదు. ప్రజలు పడుతున్న కష్టాలు చూసింది లేదు. ప్రజల కష్టాల విషయం ఎలాఉన్నా, ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకో  లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు  మీటలు నొక్కి పైసలు పంచితే చాలానే భ్రమల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే, కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్ల్యేల పని తీరుగురించి కానీ, ఎమ్మెల్యేల అవినీతి,అక్రమాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అనే విషయంలో కానీ, ముఖ్యమంత్రి పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒక విధంగా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి తనను ఎవరూ చూడడం లేదని అనుకున్నట్లుగా కాలం గడిపేశారు. గడచిన మూడేళ్ళుగా వైసీపీ ఎమ్మెల్యేల పని తీరు  నువ్వోకందుకు పోస్తుంటే నేనొకందుకు తాగుతున్నాఅన్నరీతిగానే సాగిపోయింది. 

అయితే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడడంతో, అధికార పార్టీ ఎమ్మెల్యేల గుట్టంతా రట్టవుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రహస్య సర్వే ఒకటి నిర్వహించారు. ఆ సర్వేలో కళ్ళు తెలేసే ఫలితాలు కనిపించాయి. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపిచక  తప్పదని, ఆ 50 మంది ఏమి చేసినా గెలిచే ఛాన్స్’లేదని తేలిపోయింది. ఈ 50 మందికి పార్టీ టికెట్ రాదనే విషయం కూడా స్పష్టమైందని  అంటున్నారు. అయితే, ఈ 50 మంది మాత్రమేనా మిగిలిన వంద మంది ఓకేనా అంటే కాదు. ఇంతవరకు నిర్ధారణకు వచ్చిన సంఖ్య ఇది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని అంటున్నారు. నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా, ‘టికెట్ల’ చర్చే జరుగుతోంది. నిజానికి, ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నా, ఇప్పటి నుంచే అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో  భయం పరుగులు తీస్తోందని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో వేటు పడేదెవరిపై? ఎవరి టికెట్ గాలవుతుంది అనే అంశంలో ఎమ్మెల్యేలు తెగ టెన్షన్‌ పడిపోతున్నారు. ఆ లిస్టులో తమ పేరు ఉంటుందా? అనే ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అందుకే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ దక్కని  ఎమ్మెల్యేల్లో మొదటిసారి గెలిచిన 30మంది, సీనియర్ ఎమ్మెల్యేలు 12మంది, మహిళా ఎమ్మెల్యేలు 8మంది ఉన్నారట. పనితీరు సరిగాలేకపోవడం వల్ల ఈసారి వాళ్లు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్ట్ ఇవ్వడంతో క్యాండేట్‌ను మార్చాలని జగన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే వేటుపడే సిట్టింగుల సంఖ్య యాభైతో ఆగుతుందా ? జాబితా పెరుగుతుందా అంటే, ఖాయంగాఖాయంగా పెరుగుతుందని, ఒక సరిగా బయట పెడితే, పొలోమని ఎమ్మెల్యేలు ఫిరాయింపు బాట పట్టిపోతరని అందుకే, ఇంస్టాల్’మెంట్ పద్దతిలో లిస్టు బయటకు వస్తోందని అంటున్నారు.  

నిజానికి, ప్రజలలో వీరూవారూ అని తేడాలేకుండా అన్ని వర్గాల లోనూ, స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత‌ వుంది. స్థానిక ఎమ్మెల్ల్యే మీదనే కాదు, ప్రభుత్వం పైనే, వ్యతిరేకత భగ్గుమంటోంది ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. అంతే కాదు, నిజానికి ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రే కేంద్ర బిందువని ప్రజలు గ్రహించారు. అందుకే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా, వైసీపీ సర్కార్’ను సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఆరోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, పరిశీలకులు ఘంటాపథంగా చెపుతున్నారు.