అవిశ్వాసం వీగిపోయినా చంద్రబాబు దిల్లీకి ఎందుకు వెళ్లారు?

చంద్రబాబు దిల్లీ వెళ్లారు. దీన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కొందరైతే వెటకారాలు కూడా చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవటంతో ఏపీ సీఎం మరో విధంగా హడావిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కానీ, నిన్నే పార్లమెంట్లో చర్చతో వేడెక్కిన దిల్లీకి ఇవాళ్ల చంద్రబాబు ఎందుకు వెళ్లారు? జగన్ చెప్పినట్టు అమరావతిలో కూర్చునే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు కదా? టీడీపీ ఎమ్మెల్యేలతో చేత కూడా పార్లమెంట్ సమావేశాలు సాగుతుండగానే రాజీనామాలు చేయించి నిరాహార దీక్షలు చేయవచ్చు కదా?

 

 

చంద్రబాబు దిల్లీ టూర్ ఊరికే చేస్తున్నదేం కాదు. ప్రత్యేక హోదా విషయంలో సభలో చేయాల్సింది అంతా చేసేశాం. ఇప్పుడిక పార్లమెంట్ వెలుపల జరగాల్సిందే మిగిలి వుంది. ప్రత్యేక హోదా రాలేదు. మోదీ ఇవ్వనని తేల్చేశారు. మరి ఎలా? చంద్రబాబు ఒకటి కావాలని నిర్ణయించుకున్నాకా వెనక్కి తగ్గరు కదా! అదీ ఆంధ్ర ప్రజలకు మంచి చేసేది అయితే ఆయన ఏనాడూ మడమ తిప్పరు. అందుకే, ఇప్పుడు మరో పంథాలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు జరుగుతోన్న కీలక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బాబు చక్రం తిప్పుతున్నారు.

 

 

మోదీ ఒకవేళ ముందస్తుకు సై అంటే ఇప్పుడు జరుగుతోన్న లోక్ సభ సమావేశాలే చివరివి కూడా కావచ్చు. అందుకే, హుటాహుటిన దిల్లీ చేరుకున్న చంద్రబాబు జాతీయ మీడియా ముందు ఏపీ బాధని వెల్లడించారు. ఇప్పుడైతేనే నేషనల్ మీడియా పూర్తి స్థాయి దృష్టి పెడుతుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతే ఏపీ ప్రత్యేక హోదా అంశం స్థానిక సమస్యగా భావిస్తాయి ఇంగ్లీషు, హిందీ మీడియా సంస్థులు. అందుకే, చంద్రబాబు ఇదే సమయాన్ని తెలివిగా వాడుకుంటున్నారు. సమస్యని ఏక కాలంలో మీడియా, ఉత్తరాది పార్టీలు అన్నిటి దృష్టికి తీసుకుపోతున్నారు.

ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఎంతగా ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ లో మార్మోగితే అంత ఇబ్బంది మోదీకి. అలాగే, ఈ సమస్యపై టీడీపీ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఇతర పార్టీలు ఎంతగా గుర్తిస్తే అంత మంచిది భవిష్యత్ లో. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా వుండవచ్చు. అవిశ్వాస తీర్మానంలో గెలిచినప్పటికీ మోదీ 2019 ఓటర్ల తీర్పులో గెలిచేస్తారని చెప్పలేం. అప్పుడు మోదీ వ్యతిరేక పార్టీలదే కీలక పాత్ర అవుతుంది. ఆప్ , టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ… ఇలా అనేక పార్టీలు మోదీపై గుస్సాగా వున్నాయి. ఆయా పార్టీలతో వ్యూహ రచన చేయాలంటే బాబు దిల్లీలో వుండటం ఇప్పడు తప్సనిసరి. అందుకే, చంద్రబాబు నేరుగా రాజధాని చేరి రాజకీయం చేస్తున్నారు.

 

 

ఇప్పటికిప్పుడు హోదా ఇవ్వకపోవటాన్ని ఎత్తి చూపటం, మెజార్టీ వర్సెస్ మోరాలిటి అంటూ నినదించటం ఒక కోణం. రానున్న కాలంలో మోదీ వ్యతిరేక శిబిరంలో కీలకంగా మారి అలాగైనా ఏపీకి లాభం రాబట్టుకోవటం మరో కోణం! ఇదీ సింపుల్ గా చెప్పుకుంటే చంద్రబాబు దిల్లీ టూర్ సారాంశం…