TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యోగి.. సీఎంగా రెండవ సారి...

Published on: Fri Mar 25, 2022 10:53AM

ఇంచు మించుగా 40 ఏళ్ల తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, వరసగా రెండవసారి, యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈరోజు సాయంత్రం  గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. యోగితో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముంది. యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి సారధ్యంలో రెండవసారి విజయం సాధించిన బీజేపీ, రెండవసారి కూడా యోగికీ అవకాశం ఇచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో గురువారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో యోగి బీజేపీ  శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం కోసం లక్నోలోని ఎకానా స్టేడియాన్ని ముస్తాబు చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత రెండోసారి విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టనుంది. ఈ సందర్భంగా లక్నో నగరంలో కాషాయరంగు పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, కాషాయవస్త్రాలతో అందంగా ముస్తాబు చేశారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎంలు ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతిలకు సీఎం యోగి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.

ఈ వేడుకకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్కర్ సింగ్ ధామి, బసవరాజ్ బొమ్మై, నితీష్ కుమార్, మాజీ సీఎంలు రమణ్ సింగ్, రఘుబర్ దాస్,కేంద్రమంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, మహేంద్ర నాథ్ పాండే, స్మృతి ఇరానీ, హర్దీప్ సింగ్ పూరి, అన్నపూర్ణ యాదవ్, శోభా కరంజలే హాజరుకానున్నారు..వేడుకకు పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం పరిమితం చేశారు. మిగతా వారందరికీ బయట పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

ఇదలా ఉంటే, ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను కూడా వరసగా రెండవసారి అవకాశం లభించే అవకాశం ఉందని, సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సిరాతు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి పల్లవి పటేల్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఓబీసీ ఓటర్లను ప్రభావితం చేయగలరనే ఉద్దేశంతో ఆయన్ను తిరిగి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, పార్టీ  నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు దినేశ్ శర్మ కూడా డిప్యూటీ సీఎం కానున్నారు. వీరిద్దరూ యోగి గత క్యాబినెట్‌‌లో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
యోగి అమ్మ సావిత్రమ్మ 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న, యోగి ఆదిత్యనాథ్ తల్లి పేరు సావిత్రి దేవి. అందరూ సావిత్రమ్మ అంటారు.  ఉత్తరాంచల్ రాష్ట్రంలో పూరి గద్వాల్ అన్న ప్రాంతంలోని ఒక సాధారణ మహిళా రైతు. ఇప్పటికీ 85 సంవత్సరాల వయస్సులో కూడా ,వ్యవసాయపనులలో బిజీగా ఉంటారావిడ. రాజకీయాల గురించి అంతగా పట్టించుకోరు, కానీ, ఒక కొడుకు సన్యాస జీవితాన్ని ఎంచుకుని రాజకీయ జీవితం సాగిస్తున్నా, మరో కొడుకు సైన్యంలో చేరతానంటే కాదనలేదు. అంతే ఆనందంగా ఆశ్వీరదించారు. 

యోగి ఆదిత్య నాథ్’కు తల్లి తండ్రులు పెట్టిన పేరు, అజేయ సింగ్ బిస్త్. ఎమ్మెస్సీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం బయలుదేరాడు. మాథ్స్ (లెక్కలు)లో  దిట్ట .ఎప్పుడూ నూటికి నూరు మార్కులే, అధ్బుతమైన వక్త, కార్య శూరుడు.ఉద్యోగం వేటలో వెళ్ళిన ఆయన గోరఖ్పూర్ మఠానికి చేరుకుని సన్యాస దీక్ష స్వీకరించారు. కాషాయాంబరాలతో ఇంటికి వచ్చి, తల్లి దగ్గర బిక్ష స్వీకరించి అసలు విషయం చెప్పారు. యోగి  గురువు అవైధ్యనాధ్ కోరిక మేరకు ఆమె  తన కుమారుని ధర్మ రక్షణకై ఆయనకు అప్పగించారు.