రెండో రోజు ‘మహా పాదయాత్ర’.. అమరావతి రైతుల జోరు..
Published on: Tue Nov 2, 2021 10:06AM
అమరావతి రైతుల్లో అదే ఉత్సాహం.. అదే ఉద్వేగం. మా రాజధాని మాకు కాకుండా చేస్తున్నారనే ఉద్రేగం. రెండేళ్లుగా నిర్విరామంగా ఉద్యమిస్తున్నా మూడు రాజధానులపై వెనక్కి తగ్గట్లేదు ప్రభుత్వం. అమరావతి పరిరక్షణ సమితి సైతం అంతే పట్టుదలగా ఉంది. ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలతో పాటు సీఎం జగన్‌రెడ్డి మనసు మారాలని ఆ దేవదేవుడిని వేడుకోవడానికి కదం కలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టారు.
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు.. రెండో రోజు యాత్రను తాడికొండ నుంచి ప్రారంభించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర రెండోరోజు గోరంట్లలో ముగియనుంది.
అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పయనించి డిసెంబరు 17న తిరుపతిలో ముగించనున్నారు అమరావతి రైతులు.


