ప్రచారంలో కరోనా రూల్స్ పాటించాల్సిందే! ఎస్ఈసీ తాజా ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎవరూ కరోనా మార్గదర్శకాలు పాటించడం లేదు. మాస్కులు కూడా లేకుండానే గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా శానిటైజర్లు వాడటం లేదు. రాజకీయ నేతలు కూడా మాస్కులు లేకుండానే ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో హైదరాబాద్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలకు మరోక సారి కరోనా మర్గదర్శకాలు జారీ చేసింది. 

 

ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు కచ్చితంగా కరోనా కోడ్‌ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించింది. పలు పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని గుర్తు చేసిన ఎన్నిక సంఘం.. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించరాదని సూచించింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అన్నిపార్టీల అభ్యర్ధులు, వారి కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి. అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది. 

 

ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌ ధరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. తప్పని సరిగా శానిటైజర్‌ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది. రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించే సమయంలోనూ తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌లను ప్రతి ఒక్కరూ ధరించేలా చూడాలని... చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని..సమావేశాలు, బహిరంగ సభల్లోనూ భౌతిక దూరం తప్పని సరి అని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.