TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు.. తెలంగాణలో లోటు వర్షపాతం!

Published on: Wed Jun 17, 2026 12:51PM

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందని, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశించిన ప్రజలకు, రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. జూన్  నెల సగం గడిచిపోయినా.. రాష్ట్రంలో వర్షాల జాడ కానీ, రుతుపవనాల అడ్రెస్ కానీ దొరకడం లేదు.  వానలు పడకపోవడం అటుంచి.. రాష్ట్రంపై భానుడు తన ప్రతాపాన్ని మళ్లీ చూపిస్తున్నాడు.

 దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణం రోహిణీకార్తెను తలపిస్తోంది.  వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సమయానికి తెలంగాణలో సాధారణంగా 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం  51 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే రమారమి 20 శాతం లోటు నమోదైంది.  అయితే రాష్ట్రంలోని 19 జిల్లాలలో మాత్రం 50 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో ఏకంగా 77శాతం లోటు వర్షపాతం నమోదైంది.  

మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి.  మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వంటి జిల్లాల్లో  42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో రెండో వేసవి వచ్చినట్లుందని ప్రజలు అంటున్నారు.