తెలంగాణలో మండుతున్న ఎండలు.. వడదెబ్బకు నలుగురు మృతి
Published on: Tue Apr 28, 2026 10:03AM
.webp)
తెలంగాణ వ్యాప్తంగా వేసవి తీవ్రత పీక్స్ కు చేరుకుంది. భానుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండతీవ్రత, వడదెబ్బ కారణంగా ఒక్క సోమవారం (ఏప్రిల్ 27) రోజే నలుగురు మరణించారు. ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిజామాబాద్ లో (సోమవారం (ఏప్రిల్ 27) ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం గమనార్హం.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అదలా ఉంటే.. మంచిర్యాలకు చెందిన 56 ఏళ్ల భోగారపు మారయ్య, పెద్దపల్లి జిల్లాకు చెందిన 19 ఏళ్ల మహిళ దశరథం సౌమ్య వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే నారాయణపేట జిల్లాలో ఒక గుర్తు తెలియని వృద్ధుడు సైతం ఎండ వేడికి తట్టుకోలేక మరణించినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో పొలం పనుల్లో ఉన్న కుర్మరంగు జంగయ్య అనే రైతుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.
పగలంతా నిప్పుల కొలిమిలా ఉన్న హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ జల్లులు కురిశాయి. కాగా రానున్న మూడు రోజులూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


