స్కూలు బస్సు బోల్తా... 10 మంది విద్యార్థులకు గాయాలు...

 

అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ స్కూలు బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. అధికారులు స్కూలు బస్సుల ఫిట్‌నెస్ గురించే ఆలోచిస్తున్నారు. ఆ బస్సులను నడుపుతున్న డ్రైవర్ల అర్హతలు, వారు డ్రైవింగ్ చేసే విధానాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే తరచుగా స్కూలు బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం నాడు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కమ్మవారిపాలెం దగ్గర ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.