రాఫెల్ డీల్ రచ్చ.. సుప్రీంకోర్టు విచారణ

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ గురించి బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో.. ఈ రాఫెల్ వివాదం మరింత ముదిరింది. తరువాత భారత ప్రభుత్వం ప్రమేయం లేదని ఫ్రాన్స్‌ మాట మార్చింది కానీ.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ మీద మాటల యుద్ధం చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోదీ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం, అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోదీని ఈ రాఫెల్ వివాదంతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 


అయితే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. 36 రాఫెల్ జెట్‌ విమానాల కొనుగోలుకు ఎంత వ్యయం అయిందనే వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ వినీత్‌ ధండా అనే ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కెఎం జోసఫ్‌ ఈ పిటిషన్‌ విచారణను చేపట్టేందుకు అంగీకరించారు. ఈనెల 10న ఈ పిటిషన్‌ విచారణను ప్రారంభిస్తామని జస్టిస్‌ గొగొయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

 


యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు, ఎన్డీయే హయాంలో విమానాల కొనుగోలుకు ఎంత కేటాయించారనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా న్యాయవాది వినీత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఈ ఒప్పందం ఏ విధంగా జరిగిందో తెలపాల్సిందిగా కోరారు. ఆయనతో పాటు మరో న్యాయవాది ఎంఎల్‌ శర్మ కూడా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ విచారణ కూడా ఈనెల 10న చేపట్టనున్నారు. ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా ఉన్న రాఫెల్ డీల్ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కడంతో.. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.