మంద న్యాయానికి కారణం ఏంటి? మందగిస్తున్న న్యాయమేనా?

మొబోక్రసీ… డెమొక్రసీ తెలుసుగానీ ఇదేంటి అంటారా? అచ్చ తెలుగులో చెప్పుకుంటే మంద న్యాయం! ఒక్కరిపైనో, ఇద్దరిపైనో, లేదా కొందరిపైనో… ఓ మంద అమాంతం దాడి చేసి చావబాదటం. ఆగ్రహం తప్పకపోతే చంపేయటం! ఇదీ క్లప్తంగా మొబోక్రసీ! ఈ పదం సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు వాడి మరీ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జనం మందలుగా మారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటాన్ని అరికట్టాలనీ అభిప్రాయపడింది. అందుకు తగిన చట్టం కూడా చేయాలని పార్లమెంట్ కు సూచించింది. అంతలా మొబొక్రసీ పెచ్చరిల్లిపోతోంది.

 

 

అత్యున్నత న్యాయస్థానం గోరక్షకుల ముసుగులో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడింది. కానీ, మందగా ఎగబడి అమాయకుల్నో, నేరం చేసిన వార్నో జనమే చంపేయటం చాలా చోట్ల జరుగుతోంది. గోరక్షకులు ఎవరిపైనైనా దాడి చేస్తే రాజకీయ కారణాల చేత సెక్యులర్ పార్టీలు చర్చ లేవదీస్తున్నాయి. కానీ, మిగతా సందర్భాల్లో అందరూ నిశ్శబ్ధంగా వుండిపోతున్నారు. గోరక్షకులు ముస్లిమ్ లనో, దళితుల్నో్ కొడతారు కాబట్టి పార్టీలు మాట్లాడుతున్నాయి. బీజేపిని టార్గెట్ చేస్తున్నాయి. కానీ, చాలా సందర్భాల్లో గోరక్షకులు కాని వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. విపరీతమైన కోపం వల్లో, లేదంటే నేరం చేశారని భావిస్తున్న వారిలోని అమానుషత్వం పట్ల కసితోనో జనం ఇలా చేస్తున్నారు. మందలుగా మీదపడి చంపేయటంలో చాలా సందర్భాల్లో దురుద్దేశాలు వుండకపోవచ్చు. కానీ, అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక దేశానికి , సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇది ప్రభుత్వం, ప్రజలు గమనించాలి.

 

 

ఒకవైపు కోర్టు మంద న్యాయంపై చట్టం తీసుకుర్మమని సూచిస్తుండగానే చెన్నైలో లాయర్లే ఆవేశంతో ఊగిపోయారు. మైనర్ ని ఏడు నెలల పాటూ పదిహేడు మంది అత్యాచారం చేశారని తెలిసి చావగొట్టారు. వారి ఆవేశంలోని నిజాయితీని, బాధని శంకించలేం. కానీ, అదే సమయంలో లాయర్లే ఇలా తక్షణ శిక్షలకి సిద్ధపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? కోర్టులు, జైళ్లు ఎందుకు? అత్యాచారం చేసిన వారు ఖచ్చితంగా రాక్షసులే. కానీ, వార్ని కొట్టి చంపేయటం రాజ్యాంగబద్ధమైన చర్య కాదు కదా! ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిపైనే.

 

 

మంద బలంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటంలో మరో కోణం కూడా వుంది. కోర్టు రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని చెబుతుండగానే జార్ఖండ్ లో స్వామీ అగ్నివేష్ పై దాడి జరిగింది. ఆయన మాటలు హిందువులు, హిందూత్వవాదానికి వ్యతిరేకంగా వున్నాయని దాడి చేసిన వారి వాదన. ఒకవేళ అదే నిజమైనా రోడ్డు మీద పడేసి కొట్టడం, ప్రాణాలకే హాని తలపెట్టడం…ఎంత మాత్రం అంగీకారం కాదు. మైనర్ ని రేప్ చేసిన వారిపై లాయర్ల దాడి ఒక కోణం అయితే, స్వామి అగ్నివేష్ పై దాడి మరో కోణం. ఈ రెండూ ప్రమాదకరమే. అయితే, గోరక్షకుల దాడులు, స్వామి అగ్నివేష్ పై దాడి వంటివి కొంత వరకూ ప్లాన్డ్ గా జరుగుతాయని ఒప్పుకోక తప్పదు.

 

 

బాగా ఆలోచిస్తే జనం ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటానికి ప్రధాన కారణాలు… మందగా మారి ఎవరిపై దాడి చేసినా శిక్షలు కఠినంగా పడే ఆస్కారం లేకపోవటం. దీనికి కఠినమైన కొత్త చట్టం పరిష్కారం చూపుతుంది. దురుద్దేశాలతో దాడులు చేసే వారు భయపడేలా తీవ్రమైన శిక్షలు వుంటే రౌడీ మూకలు చాలా వరకూ వెనక్కి తగ్గుతాయి. ఇక నిజంగా కొన్ని సందర్భాల్లో జనం కడుపు మండిపోయి దారుణమైన నేరాలు చేసిన వారిపై దాడులు చేయటం మన న్యాయ వ్యవస్థ లోపాల్ని ఎత్తి చూపుతుంది. నిర్భయ రేపిస్టులు , హంతకులు ఇంకా బతికే వున్నారు. అందులో ఒకడైతే మైనర్ అని చెప్పి కొందరు లాయర్లు వాడ్ని మూడేళ్ల శిక్షతో బయటపడేశారు.

ఇలాంటివి జనాల మనస్సులో గాయాలు రేపుతున్నాయి. న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ఒకవేళ న్యాయం దక్కినా ఏళ్ల తరబడి జరిగే విచారణ సగటు భారతీయుడ్ని వెక్కిరిస్తుంది. ఈ కారణాలే జనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరం చేశారని భావింపబడుతోన్న వార్ని రోడ్డు మీదే అంతం చేసేలా చేస్తున్నాయి. తాము చావబాదకపోతే, చంపకపోతే కోర్టులు, జైళ్లు నేరస్థుల్ని కాపాడతాయని జనం అనుమానం. కాదంటే నమ్మకం. ఇది పోవాలి. పోయేలా న్యాయవ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలి. నేరం చేసిన వాడు తప్పించుకోలేని స్థితి రావాలి. సత్వరం శిక్షలు పడాలి. లేదంటే జనం ఆవేశాన్ని ఏ కొత్త చట్టమూ శాంతింపజేయలేదు. న్యాయం మందగించినంత కాలం మంద న్యాయమూ వుంటూనే వుంటుంది!