TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అయోధ్య పరిష్కారం కోసం ఆగస్టు 15 వరకు గడువు

Published on: Fri May 10, 2019 12:01PM

 

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య సామరస్య పరిష్కారానికి గానూ మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి మధ్యంతర నివేదికను కమిటీ ఇటీవల సుప్రీంకోర్టుకి సమర్పించింది. అయితే సామరస్య, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. ఇందుకు సీజేఎస్ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఆగస్టు 15 వరకు గడువు కల్పించింది.

అయితే మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాలన్నీ రహస్యమైనవని, వాటిని బహిర్గతం చేయబోమని సుప్రీం స్పష్టం చేసింది. కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకొచ్చేందుకు సుప్రీం అనుమతినిచ్చింది.