మన రైతుల్ని కాపాడుకోలేమా?

posted on: Apr 28, 2020 5:43PM

చెరుకు రసం, బత్తాయి రసం,  కొబ్బరి నీళ్లు త్రాగండి  అని టీవీ, పేపర్  లలో ఒక్క హీరో / హీరోయిన్ అయినా చెప్పరు. ఎందుకంటే వాళ్లకు కోట్లలో ఇచ్చే అంత డబ్బు ఆ రైతుల దగ్గర ఉండదు. అదే దిక్కుమాలిన మన శరీరాలను సర్వ నాశనం చేసే కూల్ డ్రింక్స్ ను మాత్రము త్రాగండి అని పదే పదే చెప్తారు.  ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు హీరోలకు  కోట్లల్లో డబ్బులు ఇస్తారు. కనుక  వాళ్ళు ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఆ హీరోలకు డబ్బు ముఖ్యం.  మనుష్యుల ప్రాణాలతో వాళ్లకు అవసరం ఉండదు. కానీ మనం... హీరోలకు వాళ్ళ సినిమాలు వస్తే ఎగబడి చూస్తాము. వాళ్ళకోసం ఏమైనా చేస్తాము.

మన రైతుల కోసం మనం ఏంచేస్తున్నామో ఆలోచిస్తున్నారా? రైతులకు మనం ప్రత్యేక సహాయం చేయకపోయినా పరోక్షంగా అయినా వాళ్ళు పండించిన ఆ పంట రైతుకు మనం సహాయం చేయచ్చు.  ఎలానో చెప్పాలా?  మనం ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ మానేసి ఈ బత్తాయి, కొబ్బరి, చెరుకు రసాలు తాగండి, మనం రైతులకు సహాయం చేసినట్లే. 

పాపం రైతు మన మధ్య ఉన్నా మనం పట్టించుకోము, కానీ ఎక్కడి నుండో వచ్చిన కూల్ డ్రింక్స్ కంపెనీలను మాత్రం బ్రతికిస్తాం. ఇదెక్కడి న్యాయం చెప్పండి?  రసాల వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన రైతూ బాగుంటాడు.  

కానీ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. అయినా మనం చెడు వైపే ఆలోచిస్తాము కానీ.. మంచివైపు ఆలోచిస్తామా..? 

కరోనా లాక్ డౌన్ వల్ల ఆ హీరో ఊడ్చాడు, ఈ హీరో ఇంట్లో ఆ పని చేసాడు, ఆ హీరోయిన్ వంట చేస్తుంది అని పనికి రాని మెస్సేజ్ లు వాట్సాప్ ఫేస్బుక్ లలో పెడుతున్నారు. 

మొన్న వర్షానికి రైతులకు చాలా పంటలు దెబ్బతిన్నాయి,  మామిడి కాయలు రాలిపోయాయి, అక్కడక్కడ కోతకు వచ్చిన వరి తడిసి ముద్ద అయింది. మరి ఇలాంటి పోస్టులు పెట్టడం రాదా జనాలకు..? చెప్పండి? కరోనా వల్ల అన్ని కంపెనీలు మూతపడినా, వ్యాపారాలు ఆగిపోయినా,  ఒక్క రైతు పనులు మాత్రం ఎక్కడా ఆగిపోలేదు..!! రైతులు అలా ఆగిపోతే కరోనా మృతుల కంటే చాలా రెట్లు ఆకలి  మరణాలు చూడాల్సి వస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...