వేర్పాటువాదులను సమైక్య పరచిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’

 

ఏపీ యన్జీవోలు ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ పెద్ద గొప్ప సభేమి కాదని కేసీఆర్ అన్నారు. నిజంగా ఆయన చెప్పినట్లు అది అంత గొప్పసభ కాకపొయుంటే, ఆయన ఈ మాటే అని ఉండేవారే కారు.

 

ఏపీ యన్జీవోల సభ ప్రభావం వల్లనే ఆయన నిన్నడిల్లీ నుండి తిరిగి రాగానే హుటాహుటిన తెరాస, టీ-జేఏసీ, టీ-ఎన్జీవో నేతలతో సమావేశం అయ్యి, ఈ నెల 22న హైదరాబాదు యన్టీఆర్ స్టేడియంలో టీ-జేఏసీ అధ్వర్యంలో ‘తెలంగాణ స్వాభిమాన్ సదస్సు’ పేరిట లక్షమంది ప్రజలతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి, ఏపీ యన్జీవోల సభకు జవాబు చెప్పాలని నిశ్చయించుకొన్నారు.

 

రాష్ట్ర విభజన, హైదరాబాదు అంశాలపై ఏపీ యన్జీవోల సభ ఇచ్చిన విస్పష్టమయిన సందేశం డిల్లీ పెద్దల ఆలోచనలను ప్రభావితం చేస్తుందనే భయంతోనే ఈ భారీ సభకు సిద్దం అవుతున్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దీనికి మరో కారణం ఏమిటంటే, దాదాపు లక్షమంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వ్యతిరేఖంగా హైదరాబాదులో సభ దిగ్విజయంగా నిర్వహించడం వలన, దెబ్బతిన్నతెలంగాణా అహం చల్లార్చే ప్రయత్నమేనని చెప్పవచ్చును.

 

ఇంత కాలంగా ఎడమొఖం పెడమోఖంగా ఉన్న కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ లను, టికెట్ల విషయంలో తమను పక్కన పెట్టినందుకు తెరాస దూరమయిన టీ-ఎన్జీవో, జేఏసీ నేతలు కూడా ఏపీ యన్జీవోల సభ కారణంగానే తమ భేదాభిప్రాయాలను పక్కన బెట్టి, మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్నకేశవ్ రావు ఇంటిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

 

ఇక ఏపీ యన్జీవోల సభ రాష్ట్ర విభజన కోరుతున్నటీ-నేతలందరినీ మళ్ళీ ఏకత్రాటి పైకి తేగా, నెలరోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు, సమ్మెచేస్తున్నసీమంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు కొత్త ఉత్సాహం కలిగించింది. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు ఆత్మవిశ్వాసం పెంచింది.

 

తెలంగాణా, సమైక్యవాదులపై ఇంత ప్రభావం చూపిన ఏపీ యన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను కేసీఆర్ తేలికగా కొట్టిపడేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటనతో రాజకీయ నిరుద్యోగులుగా మారిన కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ లిరువురూ ఏపీ యన్జీవోలకు కృతజ్ఞతలు తెలుపుకోక తప్పదు.