ఇరాన్ తో దౌత్య సంబంధాలు త్రెంచుకొన్న సౌదీ అరేబియా
Published on: Mon Jan 4, 2016 10:33AM
.png)
సౌదీ అరేబియా ఇరాన్ తో దౌత్య సంబంధాలు త్రెంచుకొంటున్నట్లు నిన్న ప్రకటించింది. సౌదీలోని ఆ దేశ రాయబారికి ఈ విషయం తెలియజేసి, 48గంటలలోగా సౌదీలోని ఇరాన్ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసివెళ్లిపోవాలని కోరింది. మొన్న శనివారంనాడు సౌదీ అరేబియాలో 47మందికి బహిరంగంగా తలలు నరికి మరణశిక్ష అమలుచేసారు. వారిలో షియా వర్గానికి చెందిన షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్, మరో ఇద్దరికి మరణశిక్ష అమలుచేసింది. సున్నీ మతస్తులు అధికంగా ఉన్న సౌదీలో మైనార్టీ షియా తెగ ముస్లింల కూడా సమాన హక్కులు కావాలని షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్ చెందిన వర్గంవారు సుమారు పదేళ్ళ క్రిందట నిరసనలు తెలియజేశారు. ఆ సందర్భంగా వారికీ పోలీసులకి మధ్య ఘర్షణలో కొందరు పోలీసులు మరణించారు. వారి నిరసనలను తిరుగుబాటుగా భావించిన సౌదీ ప్రభుత్వం అనేకమందిని అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిని మొన్న బహిరంగంగా శిరచేధనం చేసింది.
షియా ముస్లింలుండే ఇరాన్ దేశం అందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ రాజకుటుంబం కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఇరాన్ షియా ముస్లిం మతపెద్ద ఆయతొల్లా అలి ఖెమైనీ హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ ఆ మరణశిక్షను నిరసించారు. షేక్ నిమ్ర్-అల్- నిమ్ర్ మరణశిక్ష విధించినందుకు తీవ్ర ఆగ్రహం చెందిన తెహ్రాన్ నగరంలో ప్రజలు అక్కడి సౌదీ దౌత్యకార్యాలయంపై దాడి చేశారు.
ఈ సంఘటనల కారణంగా ఇరాన్ తో సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు త్రెంచుకొంటున్నట్లు ప్రకటించింది. తమదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఉపేక్షించమని ఇరాన్ కోరడం చాలా అనుచితంగా ఉందని సౌదీ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌదీ నిర్ణయాన్ని ఇరాన్ తో బాటు అమెరికా కూడా తప్పు పట్టింది. ఇరుగుపొరుగు దేశాలతో బలమయిన దౌత్యసంబంధాలు కలిగి ఉన్నప్పుడే ఎటువంటి సమస్యలనయినా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది,” అని అమెరికా అభిప్రాయపడింది.


